చర్లపల్లిలో ఆయుర్వేదిక్‌ విలేజ్‌

ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో నేడు ప్రారంభం

హైదరాబాద్‌, 14-03-2018: పచ్చని చెట్లు.. వెదురు బొంగులు.. ఔషధ మొక్కలు.. అంతా హరితవర్ణ శోభితం. ఇది చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైల్లోని అద్భుత వాతావరణం. ప్రకృతి వైద్యాన్ని కాపాడటంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ... ‘మై నేషన్‌ ఆయుర్వేదిక్‌ విలేజ్‌’ను ఏర్పాటు చేసింది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ముస్తాబు చేసిన ఈ విలేజ్‌ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ బుధవారం ప్రారంభించనున్నారు.
 
ఇందులో మసాజ్‌ సెంటర్‌తోపాటు కేరళ ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదిక్‌ విలేజ్‌లో ఖైదీలే సిబ్బందిగా పనిచేస్తారు. విధులు నిర్వహించడానికి 10 మంది ఖైదీలు.. కేరళ ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో శిక్షణ పొందారు. ఆయుర్వేద వనమూలికలతో చేసిన నూనెలు, చెట్ల పసర్లతో పంచకర్మ పద్ధతిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు వీరు చికిత్స అందిస్తారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా ఆయుర్వేదిక్‌ విలేజ్‌ను నిర్మించారు. ‘‘ఆయుర్వేద వైద్యం కోసం అంతా కేరళకు వెళ్తుంటారు. అధిక నగదు ఖర్చు చేస్తారు. తక్కువ ఖర్చులోనే కేరళ వైద్యాన్ని ఆయుర్వేదిక్‌ విలేజ్‌ ద్వారా తెలంగాణ జైళ్లశాఖ అందిస్తోంది. చంచల్‌గూడ, సంగారెడ్డి జైళ్లలో ఏర్పాటు చేసిన విలేజ్‌లకు మంచి స్పందన ఉంది. అందుకే చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌లో ఆయుర్వేదిక్‌ విలేజ్‌ని ఏర్పాటు చేశాం’’అని వీకే సింగ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.