‘ఆరోగ్యశ్రీ’ చర్చలు విఫలం

యాజమాన్యాలతో మంత్రి భేటీ
చెల్లింపులపై స్పష్టత వచ్చేదాకా వైద్య సేవలు ఇంతే: ఆస్పత్రులు
పలుజిల్లాల్లో నిలిచిన చికిత్సలు
ప్రభుత్వ ఆస్పత్రులకు వెల్లువెత్తుతున్న రోగులు
వారితో మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశం
ఆరోగ్యశ్రీ సొమ్ముతో ఆస్పత్రులు నడుస్తున్నాయి
ఓ అధికారి వ్యాఖ్య.. ప్రతినిధుల ఆగ్రహం
రెండు, మూడు రోజుల్లో మరోమారు భేటీ?
పలు జిల్లాల్లో నిలిచిన సేవలు

ఆంధ్రజ్యోతి, 17-08-2019: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో.. బకాయిల చెల్లింపులపై స్పష్టత వచ్చేదాకా వైద్యసేవల నిలిపివేత యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ఆరోగ్యశ్రీ కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు వారితో చర్చించారు. ఈ భేటీకి 240 ఆస్పత్రుల యాజమాన్యాలు హాజరయ్యాయి. వారితో భేటీ అనంతరం.. ఆరోగ్యశ్రీ సేవలందిస్తోన్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. కాగా.. ‘‘ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బులతోనే మీ ఆస్పత్రులు నడుస్తున్నాయ’’ని సమావేశంలో పాల్గొన్న వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడంపై నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ భగ్గుమంది. ఆ వ్యాఖ్యలు సరికావని, ఇలా మాట్లాడం సరికాదని ఆస్పత్రుల ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ మంత్రి మాట..
ఆరోగ్యశ్రీ బకాయిలు గడిచిన కొద్ది నెలలుగా రూ.450 కోట్లు విడుదల చేశామని, వచ్చే నెలలో బడ్జెట్‌ ఉండడంతో.. దీనికి ప్రత్యేక కేటాయింపులు జరిపి పెండింగ్‌ బకాయులను వెంటవెంటనే విడుదల చేస్తామని మంత్రి ఈటల.. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల ప్రతినిధులకు హామీనిచ్చారు. కానీ, వారు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం విడుదల చేసినట్టు చెబుతున్న బకాయిలపై స్పష్టత వచ్చిన తరువాత రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశం ఉండనుంది. కాగా, ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద రూ.344.17 కోట్లు, ఈహెచ్‌ఎ్‌స కింద రూ.113.57 కోట్లు మొత్తం రూ.457 కోట్ల పెండింగ్‌ బకాయిలు మాత్రమే ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
 
అసోసియేషన్‌ మాత్రం.. తమకు ఆరోగ్యశ్రీ కింద రావాల్సిన బకాయిల మొత్తం రూ.1500 కోట్లు ఉన్నట్టు వాదిస్తోంది. అయితే.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ కలిపి ఉన్న బకాయిలు రూ. 590 కోట్లేనని సర్కారు చెబుతోంది. బకాయిల విడుదలకు సంబంధించిన గణాంకాలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై అసోసియేషన్‌లో చర్చించి మరో దఫా చర్చలకు వెళ్తామని అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. అలాగే నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేసుకున్న ఆరోగ్యశ్రీ ఒప్పందాన్ని పునఃసమీక్షించేందుకు ఒక కమిటీని వేస్తామని పేర్కొంది. ప్యాకేజ్‌ ధరలపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారితో పేర్కొన్నారు.
 
రోగులకు కష్టాలు
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో అనేక ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా.. శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కొన్ని సమ్మెలో పాల్గొనలేదు. ఎప్పటిలానే సేవలను అందించాయి. ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలతో పాటు సర్కారీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగాయి. ప్రైవేటులో సేవలు నిలిచివేతతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. ఇక.. గ్రేటర్‌ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీతో పాటు, ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జెహెచ్‌ఎ్‌స) సేవలను గురువారం అర్ధరాత్రి నుంచి అందించడం లేదు.
 
కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీ మిత్రలు కూడా అందుబాటులో లేరు. ఆస్పత్రికి వచ్చిన ఫాలో అప్‌ కేసులకు మందులు ఇవ్వడం.. ఎక్స్‌రే, సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి సేవలు బంద్‌ చేశారు. ఓపీ విభాగంలో వచ్చిన వారిని వైద్యులే పరీక్షించి.. మందులు ఇవ్వకుండా వారం, పది రోజుల తరువాత రావాలని తిరిగి పంపించారు. కొన్ని ఆస్పత్రుల్లో రోగులకు డయాలసిస్‌ సేవలు కూడా అందించలేదు. రెండు, మూడు రోజుల క్రితమే ఆస్పత్రుల్లో అడ్మిట్‌ అయిన వారిని డిశ్చార్జ్‌ చేశారు. శుక్రవారం కొత్త కేసులను తీసుకోలేదు. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో ఏకంగా ఆరోగ్యశ్రీ వార్డును పూర్తిగా మూసివేశారు.
 
ఇది ప్రభుత్వ అసమర్థత: లక్ష్మణ్‌
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందనడానికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఓ ఉదాహరణ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సంపద రెండింతలైందని స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా సీఎం చెప్పారని, అలాంటప్పుడు బకాయిలు వెంటనే చెల్లించొచ్చు కదా? అని నిలదీశారు. ఆరోగ్య శ్రీ విషయంలో ప్రభుత్వం- ఆస్పత్రుల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు విఫలమైనట్టు వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు తక్షణమే విడుదల చేసి, పేద రోగులకు సేవలు అందేలా చూడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌చేశారు. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం సరికాదని పేర్కొన్నారు.
 
నిరాటంకంగా మల్టీస్పెషాలిటీ సేవలు
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులలోని రెండు సంఘాలతో శుక్రవారం సమావేశమయ్యాం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో చర్చించాం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదు. సేవలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఇక తెలంగాణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని హామీనిచ్చాం. బకాయులు మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్‌ అవుతుంటాయి. ఇప్పుడూ అదే జరిగింది. ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నట్టు రూ.1500 కోట్ల బకాయిలు లేవు. రూ.590 కోట్లే ఉన్నాయి.
- ఈటల రాజేందర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
 
సమ్మె యథాతథం
బకాయిలు చెల్లించే విషయంపై ఈ రోజు ప్రభుత్వం చర్చలకు పిలిచింది. చర్చల్లో స్పష్టమైన హామీనివ్వలేదు. దీంతో సేవల నిలిపివేత యథాతథంగా ఉంటుంది. మా నాలుగు డిమాండ్లలో ఒకటి రెండింటిపైనే సానుకూలంగా ఉంది. పెండింగ్‌ బకాయిలకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. మాకు ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్లు రావాలి. సర్కారు మాత్రం రూ.600 కోట్లేనంటోంది.
- డాక్టర్‌ రాకేశ్‌, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌