నేటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ యథాతథం

ఆరోగ్య మంత్రితో చర్చలు సఫలం
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె విరమణ
ఇక ప్రతినెలా చెల్లింపులు: ఈటల

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పాత బకాయిలను చెల్లింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు మంగళవారం విరమించాయి. వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం ప్రతినిధుల మధ్య సచివాలయంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. బకాయిలకు సంబంధించి రూ.65 కోట్లు సోమవారమే చెల్లించగా.. మరో రూ.100 కోట్లకు బడ్జెట్‌ విడుదల ఆదేశాలను (బీఆర్‌వో) ప్రభుత్వం ఇచ్చింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ మంగళవారం ప్రకటించింది. చర్చలు ముగిసిన తర్వాత ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ విలేకరులతో మాట్లాడారు. వరస ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిల చెల్లింపులు ఆలస్యం అయ్యాయన్నారు. ఇకపై ప్రతినెలా చెల్లింపులు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.560 కోట్లు చెల్లించిందన్నారు. ఇంకా రూ.490 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. బిల్లుల చెల్లింపునకు ఇబ్బందులు లేకుండా ఆస్పత్రులతో ఓ కమిటీ వేస్తామని, ఎంవోయూలను కూడా సవరిస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ వెయ్యిరెట్లు మెరుగైనదని అన్నారు.