గాలి పీల్చినా అనారోగ్యమే!

వాయు కాలుష్య కోరల్లో ఏపీ!

ముఖ్య నగరాల్లో ప్రమాద ఘంటికలు
అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
విజయవాడలో మరీ అధికం!
గ్రీన్‌పీస్‌ నివేదికలో చేదు నిజాలు

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కాలుష్యానికి కాదేదీ అనర్హమన్నట్లు.. ఆహార దినుసులు.. కూరగాయలు వంటివే కాదు.. గాలి కూడా అనారోగ్య హేతువుగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోనూ వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుందని గ్రీన్‌పీస్‌ ఇండియా ఇచ్చిన నివేదికలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎయిర్‌ కొలిప్సే-2 పేరిట గ్రీన్‌ పీస్‌ ఇండియా తన రెండో వార్షిక నివేదికను విడుదల చేసింది. దేశంలో తగ్గిపోతున్న గాలి నాణ్యతపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే ఉద్దేశంలో భాగంగా.. ఏటా నివేదికలు వెల్లడిస్తోంది. కాలుష్యాన్ని గణించడంలో కీలకంగా చెప్పే పీఎం-10 స్థాయిని దేశంలోని 280 నగరాల్లో ఏడాది సరాసరిన తీసుకుని గణిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
 
ఏపీలో ఇదీ పరిస్థితి
ఏపీలోని 15 నగరాల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ (సీపీసీబీ) నిర్దేశించిన పీఎం-10 స్థాయి కాలుష్య స్థాయి(60 యూనిట్లు) కన్నా అధికంగా ఉంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్దేశించిన కాలుష్య ప్రమాణాల కన్నా ఇది మూడు రెట్లు అధికం. 2015, 2016 మధ్య కాలంలో విశాఖపట్నం, విజయనగరం నగరాల్లో వాయు కాలుష్యంగా స్వల్పంగా పెరిగింది. గుంటూరు, కర్నూలు, విజయవాడ, ఏలూరులో స్వల్పంగా తగ్గాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కర్నూలు, తిరుపతిలో తప్ప మిగిలిన పట్టణాల్లో ప్రతి నెలా పీఎం-10 స్థాయి కాలుష్యం ప్రామాణిక కాలుష్యస్థాయి కంటే అధికంగా ఉంది.
 
అనంతపురం, విజయవాడ, విజయనగరంలో వరుసగా మూడు నెలలు డెయిలీ ప్రామాణిక కాలుష్యస్థాయి(100 యూనిట్లు) కంటే ఎక్కువగా ఉంది. గుంటూరు, విశాఖపట్నంలో ఏడాదంతా కాలుష్యస్థాయి 70- 90 మధ్య ఉంటోందని నివేదికల్లో పేర్కొన్నారు. ఒక నెలలో విజయనగరంలో పీఎం-10 స్థాయి అత్యధికంగా రికార్డు 2016లో వార్షిక పీఎం- 10 స్థాయి సరాసరి విజయవాడలో 101, గుంటూరు 88, విజయనగరం 86, అనంతపురం 85, విశాఖపట్నంలో 77యూనిట్లు ఉంది.
 
2016లో విజయవాడలో వార్షిక పీఎం-10 స్థాయి కంటే 1.7 రెట్లు అధిక నమోదవ్వగా, డబ్ల్య్యూహెచ్‌ఓ వార్షిక ప్రమాణాలకు ఇది 5 రెట్లుగా ఉండడం ఆందోళనకర అంశం. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ మినహా.. మిగతా 23 రాష్ర్టాల్లోని నగరాల్లో నివశిస్తున్న 58 కోట్ల మంది జనాభాకు గాలి నాణ్యత గణాంకాలు అందుబాటులో లేవు. దేశ జనాభాలో కేవలం 10 కోట్ల మందికి.. అంటే 16 శాతం జనాభాకే గాలి నాణ్యత వివరాలు తెలుసుకునే అవకాశముంది.