వెస్ట్‌ నైల్‌ వైరస్‌ సోకి కేరళలో బాలుడి మృతి

 

19-03-2019: కేరళలో వెస్ట్‌ నైల్‌ వైర్‌స సోకి ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. మలప్పురానికి చెందిన ఈ బాలుడికి జ్వరంగా ఉందని ఆస్పత్రికి తీసుకువెళ్తే, వెస్ట్‌ నైల్‌ వైరస్‌ సోకినట్లుగా గుర్తించారు. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ బాలుడిని రక్షించలేకపోయారు. గ్రీస్‌, ఇజ్రాయెల్‌, రష్యా, అమెరికాలో ఎక్కువగా కనిపించే ఈ వైరస్‌ కేరళలో బాలుడికి సోకడంపై కేంద్రం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి, నిరోధక చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) ప్రత్యేక వైద్యుల బృందాన్ని కేరళకు పంపింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) కూడా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది.
 
ఎలా వ్యాపిస్తుంది
వెస్ట్‌ నైల్‌ వైరస్‌ క్యూలెక్స్‌ దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. దీనిని నివారించడానికి వ్యాక్సిన్‌ లేదు. పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఈ వైరస్‌ వల్ల ప్రమాదం ఎక్కువ. వెస్ట్‌ నైల్‌ వైరస్‌ సోకితే జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, శరీరంపై దుద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.