టీబీ చికిత్సలో ఏపీ బెస్ట్‌

ఆరోగ్యశాఖకు జాతీయ స్థాయి అవార్డులు

అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ ప్రజారోగ్య పరిరక్షణ పథకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. టీబీతో పాటు ఎయిడ్స్‌ రోగులకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ కేంద్ర ఆరోగ్యశాఖ, నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌.. ఏపీ ఆరోగ్యశాఖకు వివిధ అవార్డులు ప్రకటించింది. కేంద్ర ఆరోగ్యశాఖ అసోంలో గురువారం నిర్వహించిన జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా ప్రజారోగ్యం సంరక్షణలో ఉత్తమ, సృజతనాత్మక పద్ధతులను అనుసరిస్తున్న రాష్ట్రాలను ఎంపిక చేసింది. టీబీ నివారణలో ఏపీ ప్రభుత్వం ఉత్తమ పద్ధతులను అనుసరిస్తుండటంతో జాతీయ స్థాయిలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డుకి ఎంపిక చేసింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం అందుకొన్నారు.
 
అలాగే తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధి సక్రమించకుండా ఉత్తమ పద్ధతులను అమలు చేస్తున్న ఏపీకి కేంద్రం ప్రోత్సాహక బహుమతి ప్రకటించింది. ఉత్తమ పద్ధతుల్లో హెచ్‌ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఇంటిగ్రేటేడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్లలో క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ను అమలు చేసినందుకు కూడా నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఏపీ ప్రభుత్వానికి ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను అందించింది.