65-70% సిజేరియన్లే!

ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన కాన్పులు
12వ సీఆర్‌ఎం బృందం వెల్లడి
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కేసీఆర్‌ కిట్‌తో సర్కారీ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినా.. సిజేరియన్లు మాత్రం తగ్గలేదని 12వ కామన్‌ రివ్యూ మిషన్‌(సీఆర్‌ఎం) తేల్చింది. ఇప్పటికీ 65-70 శాతం మేరకు సిజేరియన్లు జరుగుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖలోని సీఆర్‌ఎం దేశవ్యాప్తంగా రెండేళ్లకోసారి ప్రతి రాష్ట్రంలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం, ప్రభుత్వ వైద్య పథకాలు, జాతీయ ఆరోగ్య మిషన్‌ అమలు తీరుపై పరిశీలించి, నివేదికలు ఇస్తుంటుంది. ఈ నెల 5 నుంచి 12 వరకు కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో రెండు బృందాలు పర్యటించాయి. ఈ సందర్భంగా తాము గుర్తించిన అంశాలతో పాటు సరిచేసుకోవాల్సిన విషయాలను సీఆర్‌ఎం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
 
గుర్తించిన అంశాల్లో ప్రధానమైనవి..
ప్రసవానికి, పిల్లల రోగనిరోధక టీకాలకు ఎంత ఖర్చు పెడుతున్నారనేది అంచనా వేసే వ్యవస్థ లేదు.
అంటువ్యాధులు కాని వ్యాధుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నా... వాటికి మందులు అందించడం లేదు.
ఏటా లక్షకు కొత్తగా 135 టీబీ కేసులు నమోదవుతున్నాయి.
కరీంనగర్‌లో 8 నెలలుగా 104 వాహనాలు పనిజేయట్లేదు.
కరీంనగర్‌ జిల్లాలో విద్యార్థినులు రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఉచిత వైద్య పరీక్షలు సూచించిన విధంగా జరగడం లేదు.
నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌, ఎన్‌సీడీ, ఎన్‌డీసీపీ పథకాలకు సంబంధించి గత మూడేళ్లలో నిధుల వాడకం బాగా తక్కువగా ఉంది. 2015-16లో 49 శాతం, 2016-17లో 37 శాతం, 2017-18లో 50 శాతం నిధులను మాత్రమే వినియోగించినట్లు సీఆర్‌ఎం పేర్కొంది.
 
బాగున్నవి ఇవే..
కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు, బస్తీ దవాఖానాలు, ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులు.
కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది.
ప్రసూతి గదులు అత్యాధునిక సౌకర్యాలతో బాగున్నాయి.
పిల్లల టీకాల కార్యక్రమం బాగా కొనసాగుతోంది.
కనీసం 4సార్లు పరీక్షలు చేయించుకున్న గర్భిణులు 90 శాతం.