హైదరాబాద్‌లో కలవరం...330 మందికి స్వైన్ ఫ్లూ

ఆందోళన చెందుతున్న నగర జనం

హైదరాబాద్, 05-02-2019: హైదరాబాద్‌ నగరంలో 330 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గడంతో స్వైన్ ఫ్లూ మహమ్మారి పెరిగిందని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్ డైరెక్టరు డాక్టర్ శంకర్ చెప్పారు. గత జనవరి నెలలో 1656 మందికి పరీక్షించగా 307 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. ఈ నెలలో ఇప్పటికే 246 మందిని పరీక్షించగా అందులో 23 మందికి స్వైన్ ఫ్లూ ఉందని వెల్లడైంది. చలి ప్రభావంతో స్వైన్ ఫ్లూ వ్యాధి పీడితుల సంఖ్య పెరగడంతో వారికి చికిత్స అందిస్తున్నామని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. స్వైన్ ఇన్ ఫ్లూయంజా వైరస్ ప్రబలడంతో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలలోనూ స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రబలుతోంది.