నిమిషానికి 200 సార్లు!

లయ పెరిగిన గుండె..

జీజీహెచ్‌లో అరుదైన చికిత్స

దాతల కోసం నిరీక్షణ

గుంటూరు(మెడికల్‌) ఫిబ్రవరి 13: మనిషి గుండె నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుంది. కానీ, ఆవ్యక్తికి మాత్రం గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటోంది. సాధారణ స్థితికి తీసుకురావడానికి వైద్యులు 100సార్లు కరెంట్‌ షాక్‌ ఇచినా పరిష్కారం కాలేదు. దీర్ఘకాలం హృదయ స్పం దన అలాగే ఉంటే ప్రాణాలే పోతాయి. దీనిని నివారించేందుకు డిఫిబ్రిలేటర్‌తో డీసీ షాక్‌ ఇస్తారు. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థాయికి వస్తుంది.
 
ఈ విషయాన్ని జీజీహెచ్‌కు చెందిన కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ మీడియాకు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన పి. రాంబాబు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ఉద్యోగి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో జనవరి 20న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వందసార్లు కరెంట్‌ షాక్‌ ఇచ్చారు. షాక్‌ ఇచ్చిన పదినిమిషాల వరకూ గుండెకొట్టుకునే వేగం తగ్గినా ఆ తర్వాత 200సార్లు కొట్టుకోవడం ప్రారంభించింది. దీంతో అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ చికిత్స చేశారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద ప్రభుత్వం రూ.1.40 లక్షలు మంజూరుచేసింది. ఇంట్రా కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌(ఐసీడీ) అమర్చాల్సి ఉంటుందని, రూ.3.60 లక్షలు ఖర్చవుతుందని, దాతలు సహకరించాలని శ్రీకాంత్‌ కోరారు.