నారింజ.. నిండా ఔషధాలే!

 

హైబీపీని అదుపు చేసే ఫలం

నెల్లూరు (వైద్యం), ఆగస్టు 12: మంచి రంగు, రుచి కలిగి చక్కటి ఆరోగ్యాన్నిచ్చే ఫలం నారింజ. అదే కమలా పండు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువగా దొరికే కమలాపండులో  ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. కఫం, వాతం, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలను ఇది హరిస్తుంది. శరీరానికి అవసరమైన బలంతోపాటు తేజస్సును ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో 50శాతంపైగా అధిక రక్తపోటు కారణంగా సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ముప్పును అధిగమించాలంటే రోజుకు రెండు గ్లాసుల కమలాపండు రసం తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే హెస్పెరిడిన్ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. దీనిని బట్టి కమలా పండు ఎంత విలువైనదో, శరీరానికి ఎంత అవసరమో అర్థమవుతుంది. 

ఆరోగ్యపరంగా 

కమలాపండు ఇందులో సీ విటమినతో పాటు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని చక్కెరలు ప్రత్యేకమైనవి. ఇందు లోని క్షారగుణం ఎసిడిటీని తగ్గిస్తుంది. సంతాన సాఫల్యతను కలిగించే లక్షణాలు దీనిలో ఎక్కువ. గుండె వ్యాధిగ్రస్థులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఫ అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ కమలా పండు రసాన్ని తాగితే నెల రోజుల్లో రక్తపోటు నియంత్రణకు వస్తుంది. కేన్సర్‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో సమృద్ధిగా ఉన్నాయి. నారింజ తొక్కను ఎండబట్టి పొడిచేసి సున్నిపిండితో కలుపుకుని సాన్నం చేస్తే వంటికి ఎంతో మంచింది. మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతం అవుతుంది.వ్యాధినిరోధక శక్తిని పెంచగలిగే గుణం ఈ పండులో ఉంది. ఆస్తమా, క్షయ వ్యాధిగ్రస్థులకు ఇది దివ్య ఔషధం. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తోంది. ఇందులో అధికంగా ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ మెదడును  ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచగలుగుతుంది. అజీర్ణం, జ్వరం వంటి జబ్బులను నయం చేయడంలో ఈ పండు కీలకంగా పనిచేస్తుంది.

100 గ్రాముల కమలాలో పోషకాలు 

పిండిపదార్థం - 12 గ్రాములు , ప్రొటీన్లు - 0.9 గ్రాములు, పీచు పదార్థం - 2.4 గ్రాములు, శక్తి - 48 క్యాలరీలు, విటమిన్ సీ - 53.2 మి.లీ గ్రాములు, కాల్షియం - 40 మి.లీ గ్రాములు, ఐరన్ - 0.12 మి.లీ గ్రాములు, సోడియం - 4.5 మి.లీ గ్రాములు, పోటాషియం - 184 మి.లీ గ్రాములు, మెగ్నిషియం - 10 మి.లీ గ్రాములు