ఆస్పత్రిలోనూ.. జరభద్రం

22-08-2017:కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని సామెత. ఇన్‌ఫెక్షన్ల పట్ల ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు ఈ చందంగానే ఉంటోంది. వ్యాధుల్ని వదిలించుకోవటానికి ఆస్పత్రులకు వెళ్తే కొత్తవి తగులుకుంటున్నాయి. ఇందుకు కారణం చాలా ఆస్పత్రులు, వైద్యులు ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టే జాగ్రత్తలు తీసుకోకపోవడమే! ‘హాస్పిటల్‌ అక్వైర్‌డ్‌ ఇన్‌ఫెక్షన్స్‌’, వాటి నివారణ చర్యల గురించి వైద్యులేమంటున్నారంటే...

 
ఆస్పత్రులు సూక్ష్మక్రిములకు నిలయాలు. వివిధ రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లతో ఎంతోమంది రోగులు ఆస్పత్రులను సందర్శిస్తూ ఉంటారు. వాళ్లతోపాటు వ్యాధులను వ్యాప్తి చేసే క్రిములూ ఆస్పత్రుల్లో విస్తరిస్తాయి. వీటి వ్యాప్తిని అడ్డుకోగలిగే చర్యలు తీసుకోగలిగితే మార్బిలిటీ (వ్యాధిని ప్రబలకుండా చేయటం), మోర్టాలిటీ (మరణాల రేటు)..రెండింటినీ తగ్గించవచ్చు. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించి ఆస్పత్రులు, వైద్యులు, నర్సులు పాటించవలసిన పరిశుభ్రత గురించి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ కొన్ని మార్గదర్శకాలను సూచించారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆస్పత్రులు పాటించవలసిన పరిశుభ్రతల గురించి కొన్ని సూచనలు చేసింది. కానీ వాటిని అనుసరిస్తున్న దాఖలాలు చాలా తక్కువ. ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్లు ప్రబలే వీలుండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
 
ఔట్‌ పేషెంట్లు: వైద్యులను కలవటానికి రోజూ ఎంతో మంది రోగులు ఆస్పత్రులకు వస్తూ ఉంటారు. వీళ్లందరికీ వ్యాప్తి చెందే వీలు లేని (నాన్‌ కమ్యూనికబుల్‌) మధుమేహం, హృద్రోగాలు మొదలైన వ్యాధులుండవచ్చు. స్వైన్‌ ఫ్లూ, క్షయ లాంటి అంటువ్యాధులూ (కమ్యూనికబుల్‌) ఉండవచ్చు. ఇలాంటప్పుడు అంటువ్యాధులున్న రోగులు, సాధారణ రోగులు అందరూ ఒకేచోట కలిసి కూర్చోవటం వల్ల గాలి, స్పర్శల ద్వారా క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదముంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఆస్పత్రుల్లో వైద్యుల్ని కలవటం కోసం రోగులు నిరీక్షించే హాల్‌లో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడాలి. అలాగే అంటువ్యాధులున్న రోగులను ఇతర రోగులతో కలవకుండా వేరుగా కూర్చోబెట్టే సౌలభ్యం కూడా ఆస్పత్రుల్లో ఉండాలి.
 
ఇన్‌పేషెంట్లు: ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్న రోగుల నుంచి ఇతర రోగులకు ఇన్‌ఫెక్షన్లు వ్యాపిస్తూ ఉంటాయి. రోగులకు సేవలందించే నర్సుల ద్వారా, రోగకారక క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఒక రోగి నుంచి మరో రోగి దగ్గరికి వెళ్లే ప్రతిసారీ నర్సులు చేతులకు వేసుకునే గ్లౌజులను మార్చుకుంటూ ఉండాలి. శానిటైజర్‌ను వాడాలి. అలాగే చేతులను శుభ్రం చేసుకోవటానికి తగినన్ని టిష్యూలు కూడా అందుబాటులో ఉంచాలి.
 
హాస్పిటల్‌ వ్యర్థాలు: వాడిపారేసిన సిరంజిలు, దూది, మానవ వ్యర్థాల ద్వారా ఇన్‌ఫెక్షన్లు 20ు ప్రబలే అవకాశం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్పత్రులకు వచ్చే రోగులతోపాటు వైద్య సిబ్బంది కూడా రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టే ఆస్పత్రి వ్యర్థాలను ఎలా డిస్పోజ్‌ చేయాలనే విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. హాస్పిటల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వాటిని సక్రమంగా పాటించాలి. ప్రతి ఆస్పత్రిలోని వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యర్థాలను విడదీసి విడివిడిగా వాటిలోని క్రిములు నశించేలా తగిన పద్ధతులను అనుసరించాలి. ఈ విషయంలో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తే అంటువ్యాధులు కచ్చితంగా ప్రబలుతాయి.
 
కన్సల్టేషన్‌ గదిలో: వైద్యులు రోగుల్ని పరీక్షించే గది విశాలంగా ఉండి, వైద్యులకు, రోగులకు సౌకర్యంగా ఉండాలి. అలాగే నాన్‌కమ్యూనికబుల్‌ వ్యాధులైన మధుమేహం, హైపర్‌టెన్షన్‌ రోగులను ఒకరి తర్వాత ఒకరిని పరీక్షించేటప్పుడు పరికరాలను స్టెరిలైజ్‌ చేయకపోయినా సమస్య ఉండదు. కానీ అంటువ్యాధులున్న రోగుల విషయంలో రోగి రోగికీ పరికరాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే చేతులకు గ్లౌజులు తొడుక్కుని తీసేసినా మళ్లీ నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే హ్యాండ్‌ శానిటైజర్‌ వాడాలి.
 
ఈన్‌టి డిపార్ట్‌మెంట్‌: చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో ‘ఆఫీస్‌ ఎండోస్కోపీ’ అనే పరికరం వాడకం ఇటీవలే కాలంలో ఎక్కువైంది. దీంతో చెవి, ముక్కు, గొంతు అంతర్భాగాలను స్ర్కీన్‌ మీద స్పష్టంగా చూడగలిగే వెసులుబాటు వైద్యులకు కలుగుతోంది. అయితే అదే సమయంలో ఈ పరికరాన్ని స్టెరిలైజ్‌ చేయకపోవటం మూలంగా ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. ‘ఆఫీస్‌ ఎండోస్కోపీ’ పరికరాన్ని ఒకసారి వాడిన తర్వాత కడిగి, అరగంటపాటు గ్లుటరాల్డీహైడ్‌ అనే ద్రవంలో ముంచి, తర్వాత మళ్లీ కడిగి ఉపయోగించాలి. కానీ ఎక్కువశాతం ఆస్పత్రుల్లో ఇలా జరగట్లేదు. పరికరం అంచుల్ని గుడ్డతో తుడిచేసి, వేరొక రోగికి వాడుతూ ఉండటం వల్ల రోగకారక క్రిములు ప్రబలుతున్నాయి.
 
ఐసియు: ఐసియు అనగానే క్రిములే లేని ప్రదేశం అనుకుంటాం. కానీ ఐసియులో పరిశుభ్ర పరిసరాలే ఉన్నా నర్సుల ద్వారా ఒక రోగి నుంచి మరొకరికి వ్యాధికారక కిమ్రులు ప్రబలుతూ ఉంటాయి. కాబట్టి హ్యాండ్‌ వాష్‌, హ్యాండ్‌ శానిటైజర్‌, చేతి తొడుగులను నర్సులు, వైద్య సిబ్బంది తప్పక వాడాలి. అలాగే స్వైన్‌ఫ్లూ లాంటి అంటువ్యాధులున్న రోగులను మిగతా రోగులకు దూరంగా ఉంచి చికిత్స చేసే వీలుండాలి.
 
డయాగ్నొస్టిక్స్‌: వైద్య పరీక్షలు చేసే ల్యాబుల్లో కూడా క్రిములు వ్యాప్తి చెందే వీలుంటుంది. రోగులను పరీక్షించే పరికరాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి క్రిములు సోకుతాయి. కాబట్టి ఈ పరికరాలను నిర్దేశించిన పద్ధతుల్లో స్టెరిలైజ్‌ చేస్తూ ఉపయోగిస్తూ ఉండాలి.
 
డెంటల్‌: తేలికగా వ్యాధులను వ్యాప్తి చేసే వీలున్న వైద్య విధానం దంత వైద్యం. చికిత్సలో భాగంగా నోట్లో ఉండే పరికరాలు ఎప్పటికప్పుడు స్టెరిలైజ్‌ చేయకపోతే పలు రకాల వ్యాధికారక క్రిములు విస్తరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యులు క్రిముల వ్యాప్తిని నియంత్రించే జాగ్రత్తలు తప్పక పాటించాలి.
 
రోగులూ నిర్భయంగా అడగండి!
పరిశుభ్రతా నియమాలను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను ఏ ఆస్పత్రి అనుసరించకపోయినా సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీసే హక్కు రోగులకు ఉంటుంది. చేసిన పరీక్షలు మొదలుకుని వైద్యులు రాసిన ప్రిస్ర్కిప్షన్‌ వరకూ అన్ని అంశాలనూ వైద్యులను నిర్భయంగా అడగొచ్చు. ఏ పరీక్ష ఎందుకు రాశారు? మందు వల్ల ఒరిగే ప్రయోజనం ఏంటి? మందు మోతాదు అవసరం ఎంత? మొదలైన విషయాలను వైద్యులను అడిగే హక్కు రోగులకుంటే, రోగుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, వారి సందేహాలను తీర్చవలసిన బాధ్యత వైద్యులకు ఉంటుంది. కాబట్టి ఎటువంటి సందేహాలకూ తావివ్వకుండా నిర్భయంగా అడగండి, నిలదీయండి!
 
ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ టీమ్‌
మందులకు లొంగని రెసిస్టెంట్‌ లేదా అలర్ట్‌ ఆర్గానిజమ్స్‌ అని వీటికి పేరు. మెథిసిలిన్‌ రెసిస్టెంట్‌ స్టెఫలోకోకస్‌ ఆరియస్‌, వ్యాంకోమైసిన్‌ రెసిస్టెంట్‌ ఎంటరోకోకస్‌, క్లాస్టిరీడియం డిఫిసై, ఎసిటిమోఫ్యాక్టర్‌ బౌమాని, మల్టిపుల్‌ రెసిస్టెన్స్‌ ఆర్గానిజమ్స్‌, నైసీరియా మెనింగ్జటిడిస్‌, సూడోమోనాస్‌ మొదలైనవన్నీ మొండి క్రిములు. ఇవి సాధారణ యాంటీ బయాటిక్స్‌కు లొంగవు. ఒకరి నుంచి మరొకరికి ఈ క్రిములు సోకితే వ్యాధులు ప్రబలడం, మరణాలు.. రెండూ పెరుగుతాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి అంతమొందించటం కోసం ప్రతి ఆస్పత్రిలో ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ టీమ్‌ ఉండాలి. ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్లను కనిపెట్టడం ఈ బృందం విధి. ఈ బృందం ప్రతిరోజూ ఆస్పత్రుల్లోని ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ వార్డుల్లో, ఐసియుల్లో స్వాబ్స్‌ సేకరించి, వాటిలో ఈ మొండి క్రిములున్నాయేమో పరీక్షించి వాటిని అంతమొందించాలి.
 
 
డాక్టర్‌ వి. శాతవాహన చౌదరి,
అలర్జీ, తలతిరుగుడు, తలనొప్పి స్పెషలిస్ట్‌,
సీనియర్‌ కన్సల్టెంట్‌,
అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌.