ఇంట్లోనే... ‘స్పా’!

10-09-2018: స్పా ట్రీట్మెంట్‌ ఇంట్లో కూడా తీసుకోవచ్చు. శరీరం నుంచి విషాలను వెళ్లగొట్టి, హార్మోన్ల అవకతవకల కారణంగా పెరిగిన ఒత్తిడిని తగ్గించి, ఒంట్లోని పిహెచ్‌ లెవెల్స్‌ను బ్యాలెన్స్‌ చేసే స్పా ట్రీట్మెంట్‌ కోసం ఖరీదైన స్పా సెంటర్లకే వెళ్లనవసరం లేదు. దీనికోసం వారానికోసారి 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. స్నానపు తొట్టి నిండా వేడి నీళ్లు నింపి, గుప్పెడు ఎప్సమ్‌ సాల్ట్‌ లేదా సముద్రపు ఉప్పు, 10 చుక్కల ల్యావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, అర కప్పు బేకింగ్‌ సోడా కలిపి, 20 నిమిషాలపాటు ఈ నీళ్లలో విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ఎప్పటిలాగే స్నానం చేసేయాలి. ఇలా వారానికోసారి చేయగలిగితే మానసిక, శారీరక ఒత్తిడి తొలిగి స్వాంతన దక్కుతుంది.
 
స్పా స్నానంతో ఒరిగే లాభాలు....
మెడ వరకూ నీళ్లలో మునిగి ఉండడం వల్ల గుండెకు వ్యాయామం అందుతుంది. నీటి ఒత్తిడి మొత్తం శరీరం మీద పడడం మూలంగా గుండె అవసరానికి మించి పని చేయవలసి వస్తుంది.
తొట్టి స్నానంతో పొందే స్వాంతన వల్ల నిద్రలేమి తొలగి కమ్మని నిద్ర పడుతుంది. వేడి నీళ్ల వల్ల కండరాలు ఉపశమనం పొందుతాయి. ఫలితంగా నిద్ర ఆవహిస్తుంది.
వ్యాయామం ఫలితంగా పట్టేసే కండరాలు, కీళ్లు స్పా వల్ల రిలాక్స్‌ అవుతాయి. ఫలితంగా నొప్పులు పోతాయి.