ప్రతిసారీ ఈ వెక్కిళ్ల బాధేమిటి?

నా వయసు 34. భోజనం చేసే సమయంలో దాదాపు ప్రతి పూటా వెక్కిళ్లు వస్తాయి. వెంటనే నీళ్లు తాగేస్తాను. అలా కడుపులోకి చేరే నీళ్లు ఎక్కువగా, భోజనం తక్కువగా ఉంటోంది. మిగతా సమయాల్లో కూడా తరుచూ తేన్పులు రావడం, ఛాతీలో మంట, పొత్తి కడుపు పై భాగాన నొప్పి, అసౌకర్యం, పలు మార్లు అపాన వాయువు వెలువడటం ఉంటాయి. ఎక్కువ సార్లు టాయ్‌లెట్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కడుపు ఉబ్బరానికి సంబంధించిన మాత్రలు రోజూ వేసుకుంటాను. అసలు ఈ సమస్యల వెనుకున్న కారణం ఏమై ఉంటుంది? దీని పరిష్కారం ఏమిటి?

- సి. కరుణాకర్‌, సూర్యాపేట
 
 
భోజనం చేసే సమయంలో వెక్కిళ్లు వస్తున్నాయీ అంటే, మీరు త్వరత్వరగా తింటున్నారని అర్థం. లేదా మీరు తింటున్న ఆహారం పొడిగానూ, ఘాటుగానూ ఉందని అర్థం. వేగంగా తినడం అంటే సరిగ్గా నమలకుండానే మింగేయడం. బాగా నమిలినప్పుడు ఆహారంతో పాటు లాలాజలం కలిసిపోయి అది ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. మీకున్న ప్రధాన సమస్య కడుపు ఉబ్బరం (గ్యాస్‌ ట్రబుల్‌) ఈ సమస్యకు మాత్రలు వేసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు కారణం ఏమిటో తెలుసుకుని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, సమస్య దానికదే తగ్గిపోతుంది.
 
కొందరు ఆహారం తింటున్నప్పుడు ఏదో పరుగు పందెంలో పాల్గొంటున్నట్లు ఒకటే వేగంగా తినేస్తారు. ఇలా తింటున్నప్పుడు ఆహారంతో పాటు గాలిని కూడా మింగేస్తారు. ఇలా మింగిన గాలి ఆ తర్వాత తేన్పుల ద్వారానో ఆపానవాయువు ద్వారానో బయటికి వస్తూ ఉంటుంది. మనం నోటి ద్వారా మింగుతుండే గాలి అన్నవాహిక ద్వారా పేగుల్లోకి చేరుకుంటుంది. అక్కడ ఉండే ప్లేటస్‌ అనే మరో గ్యాస్‌ ఈ గాలితో కలిసి నోటిద్వారానో, మలాసనం ద్వారానో బయటి కి వస్తుంది. వేగంగా తినే అలవాటును చిన్న చిన్న స్పూన్లతో తినడం ద్వారా తినే వేగాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి ముద్దనూ కనీసం 30 సార్లయినా నమలాలి. ఇలా ఎక్కువ సేపు నమలడం వల్ల మనం తినే ఆహార పరిమాణం కూడా తగ్గుతుంది. ఇలా చే యడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గడంతో పాటు శరీరం బరువు కూడా తగ్గుతారు