నీరే కాదు...పోషకాల గని!

23-02-2019:శరీరానికి కావలసినన్ని విటమిన్లు అందించడంతో పాటు పుచ్చకాయ అత్యంత సులువుగా జీర్ణమవుతుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా పుచ్చకాయలను అందరూ ఇష్టంగా తింటారు. దీనిలో మూడింట ఒక వంతు క్యాలరీలు మాత్రమే ఉండడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశం లేదు. ఒకవిధంగా పోషకాల గని ఇది.

పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తుంది. దాహార్తి నుంచి రక్షిస్తుంది.

21 శాతం సి- విటమిన్‌, 18 శాతం ఏ-విటమిన్‌, 5 శాతం పొటాషియంతో పాటు బి- 1, బి-5, బి-6 విటమిన్లు 3 శాతం దాకా ఉంటాయి. దీనిలో క్యాల్షియం నిల్వలు కూడా ఎక్కువే.
పుచ్చకాయలో వ్యాధినిరోధక శక్తినీ, గుండె ఆరోగ్యాన్నీ, కంటి, చర్మం ఆరోగ్యాన్నీ పరిరక్షించే కెరొటనాయిడ్లు ఉంటాయి. శ్వాసకోశాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, కేన్సర్‌ నిరోధకంగా పనిచేసే బీటా కెరోటిన్లు కూడా అవసరమైన మోతాదులో ఉంటాయి.
దీనిలోని లైకోసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
రక్తనాళాలు గట్టి పడి, బిగుసుకుపోకుండా కూడా కాపాడుతుంది. మెదడును శక్తివంతంగా మార్చడం ద్వారా మతిమరుపును కలిగించే అల్జీమర్‌ వ్యాధిని నిరోధిస్తుంది.
ఇందులోని సిట్రులిన్‌ లైంగిక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను కూడా నివారిస్తుంది.
 దీనిలోని కుకుర్‌ బిటాసిన్‌-ఇ శరీరంలో వాపులు రాకుండా నివారిస్తుంది.
వాటర్‌ మిలన్‌లోని సిట్రులిన్‌ శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ నిల్వలను పెంచుతుంది. ఇది రక్తనాళాలను విశాలం చేయడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
దీనిలో సమృద్ధిగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తిరుగాడే హానికారక ఫ్రీర్యాడికల్స్‌ను అణచివేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
విటమిన్‌- ఏ సరిపడా ఉండడం వల్ల ఇది చర్మం, కేశ సంరక్షణలో బాగా తోడ్పడుతుంది. ఎండాకాలం జుత్తుకు కావాల్సిన తేమను అందిస్తుంది.
పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.