మెంతితో మేలు

23-12-2018: మెంతుల్లో ఫైబర్‌, ప్రొటీన్లు, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మెంతులు ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణసంబంధమైన సమస్యలు తొలగిపోతాయి.

డయాబెటీస్‌: మెంతులు శరీరంలోని కార్బోహైడ్రేట్ల నిల్వలను అదుపులో ఉంచుతాయి. మెంతి గింజలు ఇన్సులిన్‌ పనితీరును మెరుగుపరుస్తాయి. మెంతుల్లో పీచు అధికంగా ఉంటుంది. టైప్‌ 1, టైప్‌ 2 డయాబెటీస్‌ సమస్య ఉన్నవారికి మెంతులు మంచి ఆహారం.

కొలెస్ట్రాల్‌: మెంతులు జీర్ణాశయంలోని కొలెస్ట్రాల్‌ను గ్రహించేలా చేస్తాయి. కాలేయంలో కొలెస్ట్రాల్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ ఉత్పత్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ట్రైగ్లాసరాయిడ్స్‌ను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి.

జీర్ణసంబంధమైన సమస్యలు: మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్‌, పీచు పదార్థాలు జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గుండె జబ్బులు: క్రమం తప్పకుండా మెంతుల్ని తినడం వల్ల గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే ముప్పు తగ్గిపోతుంది. రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యల్ని నియంత్రిస్తాయి.

టెస్టోస్ట్టెరాన్‌ హార్మోన్‌: మెంతికూర తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ ఎక్కువ విడుదలయ్యేలా చేస్తాయి. లైంగిక కోరికలను పెంచుతాయి.