పోషకాల గని రాజ్‌మా!

12-07-2019:చిరుధాన్యాలలో ‘కిడ్నీ బీన్స్‌’’ ప్రత్యేకమైనవి. ఎరుపు, బ్రౌన్‌ రంగులో ఉండే వీటిని పోషకాల గని అని చెప్పొచ్చు. పీచుపదార్థం, ప్రొటీన్లతో నిండిన ఈ సూపర్‌ సీడ్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో. వీటి వల్ల ఒనగూరే ఇతర ఆరోగ్య లాభాలేమంటే...
 
ఈ గింజల్లో పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూసి, రక్తపోటును నివారిస్తాయి. వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ రక్తంలోని కొలెస్ట్రాల్‌ నిల్వలను తగ్గిస్తాయి.
కిడ్నీ బీన్స్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. ఇవి చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి. కాబట్టి డయాబెటిక్‌ సమస్య ఉన్నవారు వీటిని తింటే ఫలితం ఉంటుంది.
వీటిలోని విటమిన్‌ బి1 జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. అల్జీమర్స్‌ ముప్పు నుంచి కాపాడుతుంది.
ఈ గింజల్లోని మాంగనీస్‌ జీవక్రియల్ని వేగవంతం చేసి, ఆహారం నుంచి తొందరగా శక్తి విడుదలయ్యేలా చూస్తుంది.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలించి, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. అంతేకాదు చర్మం మీది ముడతల్ని నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. వెంట్రుకలు, గోళ్లకు పోషణనిస్తాయి .
కిడ్నీ బీన్స్‌లో ప్రొటీన్స్‌ అధికంగా ఉంటాయి. శాకాహారులకు అవసరమైన ప్రొటీన్లు ఈ గింజల్లో లభిస్తాయి. చిన్నపిల్లల శారీరక, మనో వికాసానికి ఈ ప్రొటీన్లు ఎంతో ఉపకరిస్తాయి.
పీచు పదార్థం అధికంగా, కొవ్వులు తక్కువగా ఉండే ఈ గింజల్ని తింటే తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఫుడ్‌ ఛాయిస్‌.
ఈ గింజల్ని సరైన మోతాదులో తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. పెద్దపేగు కేన్సర్‌ ముప్పూ తప్పుతుంది.
వీటిలోని మెగ్నీషియం కొలెస్ట్రాల్‌ నిల్వల్ని తగ్గించి, రక్తనాళాలు మూసుకుపోకుండా చూసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కిడ్నీబీన్స్‌ తింటే మైగ్రేన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణులకు కావాల్సిన ఐరన్‌, ఫోలిక్‌ ఆమ్లం ఈ గింజల్లో లభిస్తాయి.