ఏమని పొగడం!

12-09-2017: పొగడ గింజలను మెత్తని చూర్ణం చేసి, రోజూ దానితో దంతాలు తోముకుంటే, వదులైన దంతాలు గట్టిపడతాయి. పొగడ వేరు బెరడును నీటిలో మెత్తగా నూరి, ఒక స్పూన్‌ ముద్దను అరకప్పు ఆవు పాలలో కలిపి, ప్రతి రోజూ ఉదయాన అలా మూడు రోజుల పాటు సేవిస్తే వృద్దుల దంతాలు కూడా ధృడపడతాయి. దీని పట్టను నమిలినా కదులుతున్న దంతాలు సైతం గట్టిపడతాయి. గింజల పొడిని అద్దితే, చిగుళ్ల వాపు తగ్గుతుంది.

30 మి.లీ చెక్క కషాయాన్ని రెండు పూటలా సేవిస్తే మూత్రపు మంట తగ్గుతుంది.

అరకప్పు పెరుగులో ఒక తులం పొగడ బెరడు రసం కలిపి రెండు పూటలా సేవిస్తే, అతిసార వ్యాధి అమీబియాసిస్‌, డిసెంట్రీ తగ్గిపోతాయి.

30 మి.లీ పొగడ చెక్క కషాయాన్ని గానీ, పచ్చి కాయలతో చేసిన కషాయాన్ని గానీ, రెండు పూటలా తాగుతూ ఉంటే, మూత్ర మార్గంలోని పుండ్లు, చీము, స్రావాలు, నొప్పి, మూత్రం ద్వారా వచ్చే రక్తస్రావం తగ్గుతాయి.

రెండు స్పూన్ల పొగడ బెరడు రసాన్ని రోజూ రెండు పూటలా సేవిస్తే గర్భాశయానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి గర్భధారణకు మార్గం సుగమం అవుతుంది.

పొగడ పూలను నీడన ఎండించి, వస్త్రంతో వడబోసి ఆ చూర్ణం భద్రపరుచుకోవడం ఎంతో క్షేమం. తలనొప్పితో బాధపడేవారు రెండు చిటికెల ఈ చూర్ణాన్ని నస్యంగా పీలిస్తే, తలనొప్పి తక్షణమే తగ్గిపోతుంది.

పొగడ పూల రసాన్ని ప్రతి రోజూ నీళ్లల్లో కలిపి తాగుతూ ఉంటే, గుండె ఎక్కువగా కొట్టుకోవడం తగ్గిపోవడంతో పాటు గుండెకు బలం చేకూరుతుంది.