కేన్సర్‌పై ‘పోరు’శనగ

 

వేరుశనగతో ఎంతో మేలు..  రొమ్ము, కాలేయ కేన్సర్‌కు చెక్‌.. 
14 రకాల యాంటీ ఆక్సిడెంట్లు.. 26 రకాల విటమిన్లతో పరిపుష్టం
శరీరానికి శక్తి, మెదడుకు యుక్తి.. వృద్ధాప్య ఛాయల నివారణ
సంపూర్ణ ఆహారంగా పల్లీ పప్పు.. కదిరి క్షేత్రంలో పరిశోధన
 
13-09-2017: మీకు తెలుసా! మహాత్మా గాంధీ రోజూ 50 గ్రాముల వేరుశనగ గింజలను తినేవారు. మీరు కూడా బాపూజీ బాటలో నడవండి! పల్లీ పప్పు తినండి. రుచికి రుచీ... ఆరోగ్యానికి ఆరోగ్యం! సామాన్యుల పాలిట జీడిపప్పుగా పేరొందిన వేరేశనగలో అనేక ఔషధ గుణాలున్నాయని తేలింది. మరీ ముఖ్యంగా... ఇది కేన్సర్‌పై పోరాడుతుందని రుజువైంది. అందుకే... వేరుశనగ పప్పును ‘సంపూర్ణ ఆహారం’గా ప్రకటించారు. అనంతపురం జిల్లా కదిరి వేరుశనగ పరిశోధనా క్షేత్ర ఉన్నతాధికారి, శాస్త్రవేత్త డాక్టర్‌ కేఎ్‌సఎస్‌ నాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’కి ఈ వివరాలు తెలిపారు. దీని ప్రకారం.. వేరుశనగలో పోషక విలువలు, ఔషధ గుణాలపై కదిరి పరిశోధన క్షేత్రంలో లోతుగా అధ్యయనం చేశారు. ఈ పప్పులో వినిఫెరాన్‌ అనే పదార్థం కేన్సర్‌ నిరోధకంగా పని చేస్తుంది. ప్రధానంగా రొమ్ము కేన్సర్‌, కాలేయ కేన్సర్‌ను అడ్డుకుంటుంది. కేన్సర్‌ శిలీంద్రాలను వినిఫెరాన్‌ చంపేస్తుంది. పల్లీపప్పు మోకాళ్ల నొప్పులకూ మందుగా పని చేస్తుంది. 100 గ్రాముల వేరుశనగలో 26 నుంచి 29ు మాంసకృత్తులు, 26ు పిండిపదార్థాలు, 50ు కొవ్వులుంటాయి.  26 విటమిన్లతోపాటు శరీరానికి అవసరమైన క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, మాంగనీస్‌ వంటి పోషకాలూ ఉంటాయి. వేరుశనగ పప్పులో 14 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పల్లీ భేషైన ఆహారం. ఈ పప్పులోని రిజ్వెట్రాల్‌ అనే రసాయనం బట్టతల రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, రక్తనాళాలు సంకోచించకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండానూ చూస్తుంది. కాగా, చేదుగా ఉండే వేరుశనగ తినొద్దని కేఎ్‌సఎస్‌ నాయక్‌ సూచించారు.