ఔషధ విలువల గని

ఆంధ్రజ్యోతి, 06-09-2017: వేప చెక్క- కరక్కాయల చూర్ణాన్ని గానీ, వేప చెక్క - ఉసిరికాయల చూర్ణాన్ని గానీ 6 గ్రాముల మోతాదులో నెల రోజుల పాటు సేవిస్తే చర్మవ్యాధులు నయమవుతాయి.

20 మి.లీటర్ల వేపాకు రసంలో ఒక స్పూను తేనె కలిపి సేవిస్తే, కడుపులోని పలురకాల క్రిములు నశిస్తాయి.

వేపనూనెకు సమానంగా నీలగిరి తైలం కలిపి, కీళ్లమీద రోజుకు రెండుసార్లు మర్ధన చేస్తూ, పైన వేడినీటితో కాపడం పెడుతూ ఉంటే నరాల నొప్పులు తగ్గుతాయి.

వేపాకులను నీడన ఎండించి, కాల్చి బూడిద చేయాలి. 10 గ్రాముల బూడిదను ఒక గ్లాసు నీటితో కలిపి సేవిస్తే, మూత్ర పిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.

వేపాకులకు సమానంగా మారేడు ఆకులను కలిపి మెత్తగా రుబ్బి తలకు పట్టించి 12 గంటల పాటు ఉంచాలి. ఈ విధంగా నెలరోజులు చేస్తే రాలిపోయిన తల వెంట్రుకల స్థానంలో తిరిగి కొత్త వెంట్రుకలు మొలుస్తాయి.

వేపనూనెను తలకు పట్టించి, గంట తర్వాత, వేపాకు క షాయాన్ని తలకు మర్దన చేస్తే, తల పై వచ్చే దురదలు, కురుపులు, పుండ్లు, చుండ్రు, పేలు హరిస్తాయి.

వేపనూనెకు సమానంగా, తేనె కలిపి, దానిలో దూది ముంచి చెవిలో పెట్టుకుంటే చెవి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

50 మి.లీ వేప పుల్లల కషాయంలో మూడు గ్రాముల త్రికటు చూర్ణం కలిపి, రోజుకు రెండు పూటలా భోజనానికి అరగంట ముందు తాగుతూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.