పోషకాల సరంజామ...జామ

06-07-2019:ఈ సీజన్‌లో తినదగ్గ పండ్లలో జామ ఒకటి. తీయగా, ఎక్కువ పీచుతో ఆకుపచ్చ, పసుపు రంగులో నోరూరించే జామ ఆరోగ్యప్రదాయిని కూడా. జామ ఆకులతో హెర్బల్‌ టీ చేసుకొని తాగితే రక్తంలో చక్కెర నిల్వలు సాధారణ స్థాయికి వస్తాయి. పోషకవిలువలతో కూడిన జామతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమంటే...

జామలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, లైకోపిన్‌ ప్రొటీన్‌ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.

ఈ పండులోని పొటాషియం, సోడియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతాయి. అంతేకాదు చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ ఉత్పత్తికి దోహదపడతాయి. దాంతో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వీటి ఆకుల కషాయం తాగితే మహిళల్లో నెలసరి సమయంలో కడుపు నొప్పి, వికారం వంటివి తగ్గిపోతాయి.
దీనిలోని విటమిన్‌ సి, లైకోపిన్‌, క్వెర్‌సెటిన్‌ వంటి పాలీఫినాల్స్‌ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి పురుషుల్లో ప్రొస్టేట్‌ కేన్సర్‌, మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను నివారిస్తాయి.
దీనిలోని మాంగనీసు ఆహారంలోని ఇతర పోషకాలను గ్రహించేందుకు సమకరిస్తుంది. ఎనభై శాతం నీటితో నిండిన ఈ పండు చర్మం నీటిని కోల్పోకుండా చేస్తుంది.
జామలో లభించే ఫోలేట్‌ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. గర్భిణులు ఈ పండు తింటే పుట్టబోయే బిడ్డలో నాడీవ్యవస్థలో లోపాలు తలెత్తవు.
ఎక్కువ పీచు, తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండడంతో మధుమేహంతో బాధపడేవారికి జామ మంచి ఫుడ్‌ ఛాయిస్‌.
రోజు అవసరమైన పీచులో 12 శాతం పీచు జామపండులో లభిస్తుంది. ఈ పండు తింటే జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది.
జామకాయ లేదా జామ ఆకులు తింటే డయేరియా, జిగుట విరేచనాలు వంటివి తగ్గిపోతాయి.
ఈ పండులోని విటమిన్‌ ఎ, విటమిన్‌ సి చర్మం ముడతలు పడడాన్ని అడ్డుకొని, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
దీనిలోని విటమిన్‌ ఎ కేటరాక్ట్‌ ముప్పును నివారిస్తుంది. కంటి చూపును పెంచుతుంది.
జామలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. జామ ఆకుల కషాయం పంటినొప్పి, చిగుళ్ల వాపును తగ్గిస్తుంది.
దీనిలోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్‌ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, శక్తిని నింపుతుంది.
జామలోని బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదుడు చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి.