కాళ్ల అలసటను పోగొట్టండిలా...

27-12-2018:దూర ప్రయాణాలు చేసినప్పుడు, కాళ్లను కదల్చకుండా ఎక్కువసేపు కూర్చుంటాం. దాంతో కాళ్లు లాగినట్టు అనిపిస్తుంది. అయితే తేలికపాటి వ్యాయామంతో ఈ సమస్యను పోగొట్టొచ్చు. నేలమీద పడుకొని, రెండు కాళ్లు గోడకు ఆనించి, చేతులు దూరంగా చాచాలి. ఈ ఎక్సర్‌సైజ్‌తో కలిగే లాభాలు తెలుసుకుందాం..
ఇది యోగ వంటి వ్యాయామం. నేల మీద వెల్లకిలా పడుకొని, గోడకు రెండు కాళ్లు ఆనించి, రెండు చేతుల్ని దూరంగా చాచాలి. కాళ్లను గోడకు దగ్గరగా కదిలించాలి. శరీరం ఎల్‌ ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. కాళ్లకు, తొడ కండరాలకు ఇది చక్కని ఎక్సర్‌సైజ్‌.
 శ్వాస మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి చేసే ఈ వ్యాయామం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి, ఉద్రేకం వంటివి మటుమాయమవుతాయి.
కాళ్లనొప్పులు ఉన్నప్పుడు గోడకు రెండు కాళ్లు ఆనించాలి. కాళ్లను నెమ్మదిగా కదిలిస్తూ ఉంటే వాటికి సాంత్వన లభిస్తుంది. కాళ్లు కదపకుండా ఎక్కువ సేపు ఉంచినప్పుడు ఈ వ్యాయామం చేయాలి.
వెల్లకిలా పడుకొని చేసే ఈ వ్యాయామం వెన్నెముకకు విశ్రాంతినిస్తుంది. వెన్నెముక మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.