నిదురించు హాయిగా...

11-03-2019: అప్రయత్నంగా, పైసా ఖర్చులేకుండా రావలసిన నిద్ర, కొంత మందిని కంటి మీద కునుకైనా లేకుండా చేస్తుంది. అందుకు గల కారణాలు చాలానే ఉన్నా, మానసిక ఒత్తిళ్లు వాటిల్లో ప్రధానమైనవి. ఆదుర్ధా, ఆందోళనలు నిద్రలేమికి మూలంగా ఉంటున్నాయి. వీటితో పాటు అజీర్తి, మలబద్దకం, అతిగా స్పందించడం, ఆగ్రహ ఆవేశాలు, చివరికి రక్త హీనత కూడా నిద్రలేమికి కారణమవుతుంది. ఈ కారణాలనుంచి బయటపడటం ప్రథమంగా ఎవరైనా చెయ్యాలి.
 
నిద్రలేమి సమస్యను తొలగించడంలో యోగాసనాలు బాగా తోడ్పడతాయి. ప్రధానంగా సర్వాంగాసనం, పశ్చిమోత్తాసనం, శవాసనం బాగా ఉపయోగడతాయి.
నిద్రకు ముందు వెన్నెముక పైన హాట్‌ ప్యాక్‌లు పెట్టుకోవడం కూడా ప్రయోజనకరమే.
నిద్రకు ముందు పాదాల పైన గోరువెచ్చని నీళ్లు ఒకటి రెండు నిమిషాల పాటు ధారగా పోయడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ప్రాణాయామం వల్ల మెదడుతో పాటు శరీరంలోని అవయవాలన్నింటికీ సరిపడా ఆక్సిజన్‌ అందుతుంది. అందువల్ల రోజూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు.