ఆఫీస్‌ సిండ్రోమ్‌

20-06-2019: ఆఫీసులో గంటలకొద్దీ సమయం కంప్యూటర్ల ముందు కూర్చుని గడిపేస్తూ ఉంటాం! అలాంటప్పుడు మనం కూర్చునే భంగిమ సక్రమంగా ఉందో, లేదో సరి చూసుకోవాలి. లేదంటే ‘ఆఫీస్‌ సిండ్రోమ్‌’ తాలూకు సమస్యలు తప్పవు.
 
ఆఫీస్‌ సిండ్రోమ్‌ అంటే: సక్రమమైన కుర్చీలు, టేబుళ్లు వాడకుండా, సక్రమమైన భంగిమల్లో కూర్చోకుండా పని చేసినప్పుడు ఎదురయ్యే శారీరక సమస్యనే ఆఫీస్‌ సిండ్రోమ్‌ అంటారు.
 
స్టాటిక్‌ పోశ్చర్‌: మన శరీరం ఒక భంగిమను 20 నిమిషాలకు మించి భరించలేదు. కాబట్టి తరచుగా కూర్చున్న భంగిమ మార్చడం, లేచి నిలబడడం, ఒళ్లు విరుచుకోవడం, నడవడం చేయాలి.
 
స్ర్కీన్‌ ఎత్తు: ఆఫీసు సీటులో కూర్చుని కళ్లు మూసుకుని నెమ్మదిగా తెరవాలి. కళ్లు తెరచినప్పుడు చూపు ఎదురుగా ఉన్న కంప్యూటర్‌ మానిటర్‌ మధ్యలోకి సాగితే మీరు కూర్చున్న భంగిమ కరెక్టుగానే ఉందని అర్థం. అలా కాకుండా మానిటర్‌కు ఏ వైపు వంగి ఉన్నా కుర్చీ ఎత్తు సరి చేసుకోవలసి ఉంటుంది.
 
భంగిమ కుదురుగా: కొందరు ముందుకు వంగిపోయి కూర్చుంటారు. మరికొందరు కుర్చీలో జారగిలబడి కూర్చుంటారు. ఇవేవీ సరైన భంగిమలు కావు. వెన్ను నిటారుగా ఉంచి, మెడ, తల ఒకే సరళరేఖలో ఉండేలా చూసుకోవాలి. వెన్ను కుర్చీకి తాకాలి.
 
సీటు సర్దుకోవాలి: కుర్చీలో కూర్చున్నప్పుడు ఎదురుగా ఉన్న టేబుల్‌ మోచేతి ఎత్తులో ఉండాలి. మోకాళ్లు, పాదాలు ఒకే సరళ రేఖలో ఉండాలి. కుర్చీ ఎత్తు ఎక్కువగా ఉంటే, పాదాల అడుగున ఫుట్‌ రెస్ట్‌ ఏర్పాటు చేసుకోవాలి.