జామపండు.. పోషకాలు మెండు

న్యూశాయంపేట (వరంగల్), ఆగస్టు 16: చాలా రకాల పండ్లు కాలానుగుణంగా ఆయా రుతువుల్లోనే లభిస్తూ ఆ సీజన్‌లో మానవుల్లో ఏర్పడే రుగ్మతలకు సహజ విరుగుడుగా పనిచేస్తుంటాయి. ఈ సృష్టిలో రుచిని, పోషకాలను ఇచ్చే ఎన్నో రకాల పండ్లు విరివిగా లభిస్తున్నాయి. ప్రత్యేకించి వర్షాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే పలు రకాల పండ్లు అందుబాటులో ఉంటా యి. అందులో జామ పండుకు ప్రత్యేకత ఉంది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ రుచితో పాటు ఆరోగ్యా న్ని ఇస్తుంది. పేదల ఆపిల్‌గా దీనికిపేరుంది. అంటే ఆపిల్‌కు ఇది ఏ విధంగానూ తీసిపోదన్నమాట. ఆ మాటకొస్తే ఆపిల్‌ కంటే ఎక్కువగానే విటమిన్లు, పోషకాలు జామపండులో ఉన్నాయి.

ఆర్యోగపరంగా చూస్తే

జామకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం కారణంగా కొలస్ట్రాల్‌, బీపీ కంట్రోల్‌ అవుతాయి. బరువు తగ్గటానికి జామకాయ ఎంతో తోడ్పడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్లు జీర్ణశక్తి పెంచుతాయి. రోజు ఒక జామకాయ తింటే డయాబెటీస్‌, ప్రొస్టెట్‌ క్యాన్స ర్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది. ప్రేగులలో ఉన్న మ్యూక్‌సను తొలగిస్తుంది. వయస్సుతో పాటు వచ్చే అల్జిమర్స్‌ను నివారిస్తుంది. కంటి శుక్లాలు, కీళ్లవాపులు రాకుండా చేసి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఈ పండులో ఉన్న విటమిన్‌ ఏ, సీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జామకాయతో రక్తంలోని గ్లూకోజ్‌ లెవల్స్‌ను బాగా తగ్గించుకోవచ్చని, దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధులు రాకుండా చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఈ కాయతో చేసిన జ్యూస్‌ కాలేయానికి టానిక్‌లా పనిచేస్తుంది. నరాల బలోపేతానికి వీటిలోని పోషకాలు ఎంతో ఉపయోగపడుతాయి. రుతుక్రమ సమస్యలు కూడా జామపండుతో దూరం అవుతాయి, గర్భిణులు జామపండు తీసుకోవడం చాలా ఉత్తమం.

 ప్రతీ 100 గ్రాముల పండులో..
 తేమ 81.7 శాతం
 కొవ్వు 0.3 గ్రాములు
 ప్రొటీన్లు 0.9 గ్రాములు
 కార్బోహైడ్రేడ్లు 14.5 గ్రాములు
 కాల్షియం 23 మిల్లీ గ్రాములు
 పాస్పరస్‌ 42 మిల్లీ గ్రాములు
 ఇనుము 1 మిల్లీ గ్రాము
 పోటాషియం 289 మిల్లీ గ్రాములు
 సోడియం 4 మిల్లీ గ్రాములు
 సల్ఫర్‌ 14 మిల్లీ గ్రాములు
 క్లోరిన్‌ 4  మిల్లీ గ్రాములు
 విటమిన్‌ ఏ 12 మిల్లీ గ్రాములు
 విటమిన్‌ బి-1 30 మైక్రోగ్రామలు
 విటమిన్‌ బి-2 0.2 మిల్లీ గ్రాములు
 విటమిన్‌ సి 319 మిల్లీ గ్రామలు
 
 జామపండుతో ఆరోగ్యం
డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌, హోమియో ఫిజీషియన్‌, హన్మకొండ
 ఈ కాలంలో ప్రకృతి ప్రసాదించే పండ్లను ప్రతీ ఒక్కరు తీసుకోవాలి. దీనివల్ల ఆర్యోగం ఎంతో మెరుగుపడుతుంది. ఈ సీజన్‌లో అందుబాటులో ఉండే జామకాయను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది పలు వ్యాధులను నివారించటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి కావాల్సిన అన్ని రకాల శక్తిని ఇస్తుంది.