మెగ్నీషియం తగ్గితే?

01-04-2019:ఖనిజ లవణాల లోపం ఆరోగ్యం మీద చూపించే ప్రభావం తక్కువేమీ కాదు. మరీ ముఖ్యంగా మెగ్నీషియం లోపం వల్ల దాదాపు 300 రకాల ఎంజైమ్‌ల పనితీరు తారుమారవుతుంది. కాబట్టి లక్షణాల ఆధారంగా ఈ లోపాన్ని గుర్తించి, జాగ్రత్త పడాలి.
 
మెగ్నీషియం విధులు ఇవే! 
గుండె లయ సమంగా ఉంచుతుంది.
కండరాలు, నాడులు సక్రమంగా పని చేయాలంటే శరీరంలో ఎలకొ్ట్రలైట్స్‌ సరిపడా ఉండాలి. ఈ తూకాన్ని మెగ్నీషియం సమీక్షిస్తుంది.
 ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియంను శరీరం శోషించుకోవాలి. ఇందుకు మెగ్నీషియం తోడ్పడుతుంది.
శరీరం ‘గ్లూటథయాన్‌’ అనే యాంటీఆక్సిడెంట్‌ను తనంతట తాను తయారుచేసుకోవడానికి మెగ్నీషియం అవసరం.
ఈ లవణం లోపిస్తే?
కండర కణజాలంలో సరిపడా మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం ఉంటేనే కండరాలు అలసిపోకుండా పని చేస్తాయి. మెగ్నీషియం లోపిస్తే, కండరాల నొప్పులు, పట్టేయడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
గుండె దడ, లయ తప్పడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ధమనుల గోడల్లోని కండర కణాలను రిలాక్స్‌ చేయడానికి మెగ్నీషియం అవసరం. ధమనులు రక్తప్రవాహం సమయంలో సంకోచవ్యాకోచాలకు లోనవడానికి ఈ లవణం ఉపయోగపడుతుంది. ఈ లవణం లోపిస్తే ధమనులు గట్టిపడి రక్తపోటు పెరుగుతుంది.
కణాల్లో శక్తి ఉత్పత్తి అవాలంటే మెగ్నీషియం అవసరం. ఈ ఖనిజ లవణం లోపిస్తే శక్తి తయారవక నిస్సత్తువ ఆవరిస్తుంది.
డిప్రెషన్‌/ఆందోళన/నిద్రలేమి
ఈ మూడు సమస్యలకూ మెగ్నీషియం లోపం కూడా ఓ కారణం కావచ్చు.
తినవలసిన ఆహారం!
అవకాడొ, నట్స్‌, సీడ్స్‌, ఆకుపచ్చని కూరగాయలు, పాలకూర.