గడ్డి కాదు!....అమృతం!!

28-08-2017:భూమిలో పాతుకుని ఉన్నంత సేపే, ఏ చెట్టయినా పచ్చపచ్చగా మెరిసిపోతుంది. ఒక్కసారి ఆ భూమితో తెగతెంపులు చేసుకుని, వేళ్లు పెకిలించుకుని, ఈవలికి వచ్చిపడిందా...! పచ్చదనమంతాపోయి, ప్రాణర హితంగా మారిపోతుంది. ప్రకృతి నుంచి, ప్రకృతి సిద్ద జీవనశైలి నుంచి దూరంగా వెళుతున్న. మనిషి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఆధునిక జీవనంలో ప్రధాన భాగమైపోయిన పిజ్జాలు, బర్గర్ల నుంచి, సూప్స్‌, కూల్‌ డ్రింక్స్‌ దాకా.... అన్నీ. ప్రాణాల్ని హరింపచేసేవే తప్ప వీటిల్లో ఏ ఒక్కదానికైనా ప్రాణాల్ని నిలబెట్టే శ క్తి ఉందా? నిజానికి వేల సంవత్సరాల క్రితమే కొందరు మహర్షులు అద్భుతమైన ప్రకృతి చికిత్సా విధానాలెన్నో సూచించారు. వాటిల్లో ఏ కొన్ని పాటించినా, మానవ శరీరాలు ఇంతగా రోగ గ్రస్థమయ్యేవే కాదు. ప్రస్తుతం మనం ఏ ఆహారపానీయాలు తీసుకున్నా, వాటిల్లో శక్తిదాయకాలెన్ని? రోగకారకాలెన్ని? రోగనిరోధక శక్తిని పెంచేవెన్ని? ఈ దృష్టితో చూడాల్సి వస్తోంది. ప్రస్తుతానికి గోదుమ నారు (గోదుమ గడ్డి) రసం, లేదా పొడినే తీసుకుంటే.... మనిషిలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవశక్తిని పదింతలు చే యడంలో దాని పాత్ర ఎంతో కీలకమని చెప్పే పలు శాస్త్రీయ విశ్లేషణలు మన ముందున్నాయి.

మన శరీరానికి అవసరంగా, మనసుకు ఆసక్తికరంగా అనిపించేవే కావచ్చు. వాటిల్లో అన్నింటికి అన్నీ మేలు చేసేవిగా ఏమీ ఉండవు.మనకు అందుబాటులో ఉన్న ఏ పదార్థంలోనైనా, శరీరానికి మేలు చేసేవాటితో పాటు కీడు చేసేవీ ఉంటాయి. అయితే, ప్రకృతి సిద్ధమైన వాటిల్లో ప్రత్యేకించి గోదుమ నారులో మాత్రం, ఆరోగ్యదాయకమైనవే తప్ప వాటిల్లో ఏ ఒక్క అంశమూ హానికారకమైనవి కావు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ గోదుమ గడ్డి రసం లేదా చూర్ణం, ఒక ఔషధంగా ఆదరణ పొందుతోంది.
 
ఆపద్భాంధవిగా....

ప్రతి మనిషిలోనూ సహజంగానే ఒక నిరోధక వ్యవస్థ ఉంటుంది. చాలా జబ్బుల నుంచి నిరంతరం అది మనిషిని కాపాడుతుంది. ఎప్పుడైనా ఆ రోగ నిరోధక శక్తికి మించిన సమస్య తలెత్తినప్పుడే వైద్య చికిత్సలు అవసరమవుతాయి. కాకపోతే కాలగతిలో వస్తున్న వివిధ పరిణామాల్లో భాగంగా, హానికారక ఆహార పానీయాల వల్ల, కలుషిత వాతావరణం వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల అతనిలోని వ్యాధినిరోధక శక్తి రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా శరీరాలు అనునిత్యం అనారోగ్యం పాలవుతున్నాయి. ఈ స్థితిలో గోదుమ గడ్డి చూర్ణంక, రసం ఉపకరిస్తాయి.

గోదుమగడ్డి రసం లేదా చూర్ణం సహజసిద్ధమైన పౌష్టికాహారం. అదే సమయంలో ఔషధంగా కూడా ఇది పనిచేస్తోంది. మౌలికంగా, గోదుమ నారు పొడిలో 111 రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. మరోరకంగా చెప్పాలంటే, 23 కిలోల కూరగాయలు ఇచ్చే శక్తిని ఒక కిలో పచ్చి గోదుమ నారు ఇస్తుంది. గోదుమ నారులో ఎ,బి,సి, ఇ మొదలైన విటమిన్లు, ప్రొటీన్లు, అమీనో యాసిడ్లు, ఎంజైములు, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి. వీటితో పాటు సోడియం, పొటాషియం, జింక్‌, భాస్వరం, సెలీనియం వంటి ఖనిజాలు, పత్రహరితం, పీచుపదార్థం, మానవ శరీరానికి కావలసిన పరిణామంలో ఉన్నాయి.

శరీరానికి అవసరమైన మొత్తం 22 అమైనో యాసిడ్స్‌ల్లో 19 ఒక్క గోదుమ నారులోనే లభిస్తాయి.

గోదుమ నారులో పత్రహరితం (క్లోరోఫిల్‌) 70 శాతం ఉంది. మనిషి రక్తానికి ఎరుపుదనం తెచ్చే ’హెమిన్‌’ కణ స్వరూపానికీ, క్లోరోపిల్‌ కణ స్వరూపానికీ మధ్య సారూప్యత ఉండడమే కాదు అంతే శక్తిమంతంగా కూడా పనిచేస్తుంది.

గోదుమ నారు రసంలో అతి త్వరితంగా రక్తంలో కలిసిపోయి, అన్ని కణాలకూ వ్యాపించి వాటిని బలోపేతం చేసే శక్తి ఉంది.

గోదుమ నారులోని ఈ పత్రహరితంతో పాటుగా ఇంకా అనేక ఇతర పదార్థాలు ఉండడం వల్ల గోదు నారు రసాన్ని ’ గ్రీన్‌ బ్లడ్‌’ అని కూడా అంటారు. ఇది రక్తహీనతను (అనీమియా)ను తగ్గిస్తుంది. క్లోరోఫిల్‌లో ఉండే క్రిమిసంహారక శక్తి కూడా ఎక్కువే. ఇది యాంటీ సెఫ్టిక్‌గా పనిచేస్తుంది.

ఆస్తమా, అల్సర్లు, చర్మవ్యాధులు, చిన్నపేవు ఉబ్బడం, గాయాలు మానకపోవడం వంటి సమస్యలను గోదుమనారు చూర్ణం నయం చేయగలదు. శరీరంలోని విషపదార్థాలను తొలగించగలదు.

 గోదుమ నారు చూర్ణంలో కరగని, కరిగిపోయే ఈ రెండు రకాల పీచుపదార్థాలూ ఉన్నాయి. ఇందులోని కరగని పీచుపదార్థం చిన్న పేగులో, జీర్ణకోశంలో ఆహారపు కదలిక జరిగేలా చూస్తుంది. దీనివల్ల మలబద్ధకం పోయి, శరీరంలో విషపదార్థాలు చేరే అవకాశం లేకుండాపోతుంది. కరిగే పీచుపదార్థం కార్బోహైడ్రేట్లు శరీరంలో ఇమిడిపోయే విధానాన్ని ఆలస్యం చేస్తుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. పీచుపదార్థం కేన్సర్‌ నిరోధకంగా కూడా పనిచేస్తుంది.

జీర్ణాశయానికి సంబంధించిన మలబద్ధకం అసిడిటీ, పైల్స్‌, కోలైటిస్‌, అల్సర్స్‌ తో పాటు, కిడ్నీ సమస్యలను కూడా గోదుమ నారు చూర్ణం దూరం చేస్తుంది. అలర్జీ, సొరియాసిస్‌, మొటిమలు, ఎగ్జిమా వంటి చర్మ రోగాల నుంచి విముక్తి కలిగిస్తుంది.

కేన్సర్‌, బి.పి, బహిష్టు సమస్యలు, పక్షవాతం, లుకేమియా, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్‌, నిద్రపట్టకపోవడం, ఆస్తమా బ్రాంకైటిస్‌ నివారణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణ శక్తిహీనతను తొలగిస్తుంది.

క్రమంగా పెంచాలి

ప్రారంభంలో ఈ రసాన్ని కొద్దిమోతాదులో తీసుకుంటూ క్రమంగా మోతాదు పెంచాలి. మామూలు జబ్బులకు 10 మి.లీ రసం చాలు. తీవ్రమైన వ్యాధితో బాధపడే వారు 25 నుంచి 50 మి. లీ రసం చొప్పున రోజుకు మూడు సార్లు తాగాలి. ఈ రసం తాగిన అరగంట దాకా మరేమీ తీసుకోకూడదు. ఈ రసాన్ని పొద్దున పరగడుపున తీసుకోవడమే మేలు. ఒకవేళ పొద్దున్నే తీసుకోవడం వీలు కాని వారు మధ్యాహ్నం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. వ్యాధి గ్రస్థులు తమ సమస్య నయం అయ్యేదాకా వరుసగా వాడవచ్చు. ఆరోగ్యవంతులు ఈ రసం తాగితే మరింత ఆరోగ్యవంతులవుతారు. వీరు 3 మాసాలు వాడిన తర్వాత ఆపేయాలి మళ్లీ మూడు నెలల తర్వాత వాడుకోవచ్చు. వీరు 2.5 గ్రాముల చూర్ణాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున 20 మి. లీ నీటితో కలిపి సేవించాలి. రుచికొరకు తేనె కలుపుకోవచ్చు మధుమేహలు మాత్రం తేనె కలుపుకోకూడదు. ఏదో వ్యాధిన బారినపడి దాని తాలూకు అనేక పరిణామాలకు ఆ తర్వాత బలికావడం కన్నా, గోదుమ నారు రసం సేవించడం ద్వారా ఆ వ్యాధులను అసలే దరిచేరకుండా చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 
ఎలా తీసుకోవాలి?
గోదుమ నారులో అనేకమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఒకే పదార్థంలో ఇవన్నీ ఉండడం వల్ల ఒక్కుమ్మడిగా వాటన్నింటినీ తీసుకోవడంలో తొలుత మన శరీరం కొంత ఇబ్బంది పడుతుంది. మరీ ముఖ్యంగా మన శరీరంలో మలినాలు బాగా పేరుకుపోయినప్పుడు వాటిని స్వీకరించడానికి శరీరం ఇష్టపడదు. అందువల్ల ముందు బాగా విరేచనం అయ్యేలా చూసుకోవాలి. నాలుగు రోజుల పాటు ఘనాహారం ఏమీ తీసుకోకుండా, వెచ్చని నీరు, పండ్ల రసం తీసుకోవాలి. చాలా స్వల్పంగా ఉడికించిని కాయగూరలు తీసుకోవచ్చు. ఇలా నాలుగు రోజులు గడిపాకే గోదుమ నారు రసంగానీ, చూర్ణం గానీ తీసుకోవాలి. గోడుమ నారు రసంలో పీచుపదార్థం ఉండదు. కాబట్టి చూర్ణాన్ని నీళ్లల్లో కలుపుకుని తీసుకోవడమే ఉత్తమం. గోదుమ నారు రసాన్ని తయారు చేసుకున్న వెంటనే తాగెయ్యాలి. చాలా సేపు అలాగే ఉంచితే అందులోని ఔషధ గుణాలు తగ్గుతాయి. ఒకవేళ ఈ రసం వగరుగా, ఘాటుగా అనిపిస్తే, కొంచెం తేనె కలిపి తాగవచ్చు.