జ్ఞాపకశక్తి పెరగడానికి..

29-08-2017: సీనియర్‌ సిటిజన్స్‌కు అవకడో ఎంతో మంచిదట. ఈ పండును రోజూ తినడం వల్ల వృద్ధుల కంటి ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి కూడా బాగా మెరుగుపడుతుందట. అంతేకాదు మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుందని  అధ్యయనకారులు చెప్తున్నారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా  ప్రతి రోజూ అవకడోను తిన్న వృద్ధుల కళ్లల్లో ల్యుటిన్‌ ప్రమాణాలు పెరుగుతాయి. దాంతో మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ల్యుటిన్‌ పళ్లల్లో, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పెరిగిన ల్యుటిన్‌ మెదడు, రక్తం, కళ్లల్లోకి చేరుతుంది. ఇది యాంటి-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంటు మాత్రమే కాదు శక్తివంతమైన యాంటాక్సిడెంట్‌ కూడా. అమెరికాలోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ కళ్లల్లో  పెరిగిన ల్యుటిన్‌ పరిమాణం మెదడు ఆలోచనా శక్తిని పెంపొందించడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. వారిలో జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రతా శక్తి పెరగడాన్ని కూడా గుర్తించారు. అవకడో తినని వారిలో కాగ్నిటివ్‌ సామర్థ్యం పరిమితంగానే పెరగడాన్ని కూడా పరిశోధకులు గమనించారు. మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా అవకడో ఎంతో మంచిది. సప్లిమెంట్స్‌ కన్నా తాజా అవకడోలు తిన్న వాళ్ల కళ్లల్లో ల్యుటిన్‌ ప్రమాణాలు రెట్టింపు ఉంటాయి. వృద్ధుల కంటిని, మెదడును ఆరోగ్యంగా ఉంచే అవకడో వాళ్లకి మంచి మందు అనడంలో సందేహం లేదంటున్నారు పరిశోధకులు.