స్వైన్‌ ఫ్లూ సోకకుండా...

26-02-2019: స్వైన్‌ ఫ్లూ అంతకంతకీ విస్తరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, స్వైన్‌ ఫ్లూ రోగుల సంఖ్యతోపాటు, మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఇంతగా స్వైన్‌ ఫ్లూ విజృంభించడానికి కారణాలు అవగాహన, అజాగ్రత్త లోపాలే!
 
గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే హెచ్‌1ఎన్‌1 వైర్‌సను నియంత్రించడం తేలికే! రోగి దగ్గులు, తుమ్ముల ద్వారా గాల్లో కలిసే ఈ వైరస్‌, అదే గాలిని పీల్చుకోవడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. రోగులతో సన్నిహితంగా మెలగడం, వారు వాడిన వస్తువులను తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వ్యాధి ప్రబలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే....
దగ్గినా, తుమ్మినా నోరు, ముక్కులను రుమాలుతో కవర్‌ చేసుకోవాలి.
చేతులను తరచుగా సబ్బు నీటితో కడుక్కోవాలి.
రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి.
ఇవి కూడదు:
చేతులు కడుక్కోకుండా నోరు, ముక్కు, కళ్లు తాకకూడదు.
స్వైన్‌ ఫ్లూ రోగుల చేతులు తాకకూడదు, కౌగిలించుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు.
బహిరంగా ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు.
వ్యాధి సోకే అవకాశాలు వీరికి ఎక్కువ!
ఐదేళ్ల లోపు పిల్లలు. మరీ ముఖ్యంగా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండే రెండేళ్ల లోపు పిల్లలు.
65 ఏళ్లు పైబడిన వృద్ధులు.
గర్భిణులు
ఆస్తమా, ఎంఫిసీమా, మధుమేహం, హృద్రోగం, కాలేయం, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు.
పలు కారణాల వల్ల వ్యాధినిరోధకశక్తిని తగ్గించే మందులు వాడేవారు.