ఖర్జూరంతో గుండె పదిలం!

17-05-2019: ఎడారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇవి ఈ సీజన్‌లో (రంజాన్‌ మాసంలో) ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటిని భర్తీ చేయవచ్చు.
 
ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివి..
ఖర్జూరంలో శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండులో కన్నా ఎక్కువ ఫైబర్‌ లభిస్తుంది.
వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం వంటి జీర్ణసంబంధమైన సమస్యలను తొలగించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీర అవయవాల పనితీరుకు కావలసిన కాల్షియం, ఐరన్‌. మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌, మాంగనీస్‌ వంటి మినరల్స్‌ ఖర్జూరంలో ఎక్కువగా ఉంటాయి.
ఖర్జూరంలో సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ చక్కెరలు ఉంటాయి. ఇవన్నీ తొందరగా శక్తినిస్తాయి.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖర్జూరంలోని ఐసోఫ్లేవనాయిడ్స్‌ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి.
ఈ ఎడారి పండులోని మెగ్నీషియం, సెలీనియం, కాపర్‌ వంటి మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా చేస్తాయి. అంతేకాదు ‘ఆస్టియోపోరొసిస్‌’ బారిన పడకుండా చూస్తాయి.
ఖర్జూరంలోని పొటాషియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతుంది. వీటిలోని ఫైబర్‌ రక్తంలో చక్కెర నిల్వలు పెరగిపోకుండా చూస్తుంది.
ఈ పండులోని మెగ్నీషియం గుండె కండరాలు, రక్త నాళాల్లోని కండరాల మీద ఒత్తిడి పడకుండా చేసి, రక్తపీడనాన్ని తగ్గిస్తుంది.
వీటిని తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
ఆక్సిడేటివ్‌ ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ డేట్స్‌ తింటే నాడీకణ సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది.
ఖర్జూరం తినడం ద్వారా జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది పెద్దపేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పెద్దపేగు కేన్సర్‌ ప్రమాదాన్ని నివారిస్తుంది.
వీటిలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి తింటే కంటి చూపు మెరుగవుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది.
గర్భం దాల్చిన మహిళలకు ఎక్కువ శక్తి అవసరం. వారికి కావలసిన క్యాలరీలు, పోషకాలు ఖర్జూరంలో లభిస్తాయి.
వీటిలోని విటమిన్‌ సి, డి చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
ఖర్జూరంలోని ఐరన్‌ మాడు భాగానికి రక్తప్రసరణ జరిగేలా చేసి, కేశాలు పెరిగేందుకు దోహదపడుతుంది. అంతేకాదు జట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది కూడా!