ఆరోగ్యం దాల్చిన చెక్క

03-08-2019: దాల్చిన చెక్క... వంటల రుచిని, సువాసనను పెంచే మసాలా దినుసే కాదు ఆరోగ్యాన్ని కాపాడే ఔషధం కూడా. పొడి, నూనె రూపంలోనూ లభించే దాల్చినచెక్క చర్మ సౌందర్యాన్నీ పెంచుతుంది. ఈ సుగంధద్రవ్యం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేమంటే...

దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

జీర్ణ సంబంధ సమస్యలకు దాల్చిన చెక్క మందుగా పనిచేస్తుంది. దీనిలోని పీచుపదార్థం కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఆకలిని పెంచుతుంది.
దాల్చిన చెక్కనూనె ఒంటికి రాసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.
దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్త సరఫరా సవ్యంగా జరిగేలా చూస్తాయి.
వీటిలోని సిన్నమాల్దిహైడ్‌, నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి, తాజా శ్వాసను ఇస్తుంది. దాల్చిన చెక్కను నీళ్లలో వేసి, మరిగించి, ఆ నీటిని
మౌత్‌వా్‌షగా ఉపయోగించొచ్చు.
వీటిలోని ప్రొటీన్లు చర్మం మీది ముడతల్ని నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమం ముఖానికి
తాజాదనాన్ని ఇస్తుంది.
దాల్చినచెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తపీడనం అదుపులో ఉంటుంది. చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. టైప్‌ 2 డయాబెటీస్‌ ఉన్నవారు ప్రతి రోజు టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
కొలెస్ట్రాల్‌ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమ్‌ను నియంత్రించి, రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తుంది. గుండె సంబంధ
జబ్బులను నివారిస్తుంది.
పలు రకాల కేన్సర్ల ముప్పును దాల్చిన చెక్క నివారిస్తుంది. వీటిలోని
మెగ్నీషియం, కాల్షియంతో కలిసి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ పెంచి, కురులు పెరిగేందుకు తోడ్పడుతుంది. టేబుల్‌ స్పూను దాల్చినచెక్క పొడి, తేనె, కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.
దాల్చిన చెక్క వాసన మెదడును ఉత్తేజితం చేస్తుందని, దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల ముప్పు తప్పుతుందని పరిశోధనల్లో తేలంది.
ఈ సీజన్‌లో వేధించే జలుబు, జ్వరాలను దాల్చినచెక్క నివారిస్తుంది.