ఔరా! అవిసెలు...

20-11-2017: ‘అవిసెలు’ అనే పేరు ఎప్పుడూ వింటున్నదే. కానీ, అవిసె గింజల్లోని ఔషధ విలువల గురించి తెలిసింది చాలా తక్కువే. నిజానికి, అవిసెలు జీవక్రియ రేటును పెంచి, ఆక్సీకరణను చైతన్యపరుస్తాయి. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీనివల్ల శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గులను నిరోధించడానికి ఈ వేడి తోడ్పడుతుంది. అవిసె గింజల్లో శరీరానికి కావల్సిన ఖనిజాలు, విటమిన్లతో పాటు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలు ఆరోగ్యంగా పెరగడానికి ఇందులోని మాంసకృత్తులు తోడ్పడతాయి. పెద్ద పేగును ఆరోగ్యవంతంగా మలిచి మలబద్దకం సమస్య లేకుండా చేస్తాయి.

అవిసెల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సరిపడా ఉన్నాయి ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించడం ద్వారా హృద్రోగాలు, కీళ్ల వాతం, ఉబ్బసం, మధుమేహం వంటి వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి.
లైంగిక దుర్భలతతో బాధపడే వారికి ఇందులోని ఒమేగా- 3 ఆమ్లాల వల్ల మేలు కలుగుతుంది. ఈ గింజల్లోని ఫోలిక్‌ యాసిడ్‌ వ్యంధ్యత్వ సమస్య నుంచి విముక్తి పొందడానికి తోడ్పడుతుంది. అవిసెగింజల్లో యాంటీ ఆక్సిడెం ట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి రక్తశుద్ధిని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అవిసెల నుంచి తీసే నూనె చుండ్రు, ఎగ్జిమా, పొడిచర్మం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండవల్ల చర్మం పేలడం, చెమట కాయలు తలెత్తడం వంటి సమస్యలను దూరం చేస్తుంది..
ఈ గింజల్లోని పైటో ఈస్ట్రోజన్స్‌ రుతుక్రమ సమస్యలనుంచి మహిళలను కాపాడతాయి. బహిష్టువేళల్లో వచ్చే నొప్పులు కూడా అవిసెగింజలతో తగ్గుతాయి.
రోజూ ఒక టీ స్పూను అవిసె గింజలను చప్పరిస్తే, పెప్టిక్‌ అల్సర్లు నయమవుతాయి. అవిసెల్లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, చర్మాన్ని, మృదువుగా, ముడతలు పడకుండా చూస్తాయి. మైగ్రేన్‌ నొప్పుల నుంచి ఉపశమనానికి అవిసె నూనె బాగా పనిచేస్తుంది.

మానసిక ప్రశాంతత... ఏకాగ్రత...

యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు అవిసె గింజల్లో మెండుగా ఉన్నాయి. మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్ల కారణంగా తలెత్తే హానికారక ప్రభావాలను అవిసెల్లోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రతను, ప్రశాంతతను కలిగించడంలో ఇందులోని ఆమ్లాలు తోడ్పడతాయి. రోజూ ఒక టేబుల్‌ స్పూన్‌ అవిసెనూనెతో మర్ధన చేసుకుంటే చర్మ రంధ్రాలు మూసుకుపోవడం గానీ, చర్మం కందిపోవడం గానీ జరగదు. ప్రకృతి సహజమైన ఈ అవిసె గింజలు శరీరాన్ని ఎన్నో విధాలుగా కాపాడతాయి.