నిద్రలేమితో ఆరోగ్యలేమి!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకోసమే. కానీ, ప్రస్తుత ఉరుకులుపరుగుల జీవితంలో చాలామంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఆధునిక జీవనశైలి ఒకవైపు ప్రగతిబాటలో ముందుకు తీసుకెళ్తూనే, మరోవైపు వెనకబాటుకి కారణం అవుతోంది. జీవనవిధానంలో మార్పువల్ల పని, ఆహారం, నిద్ర వంటి విషయాలు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు, శ్వాస, ఎండ ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర సరిగా పట్టకపోవడాన్ని ‘నిద్రలేమి’ లేదా ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. ఒక్కరోజు రాత్రి సరిగ్గా నిద్ర లేకపోతే మరుసటి రోజు పగలంతా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరాకు, నిద్రమత్తు, బలహీనత, మతిమరుపు, ఏ పనీ చేయాలనిపించకపోవటం, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే ఎన్నో నెలలు, సంవత్సరాల నుంచి నిద్రలేని రాత్రులు గడిపేవాళ్ళకి ఈ లక్షణాలతోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అవి అజీర్ణం, మలబద్ధకం, ఒళ్ళునొప్పులు, బి.పి., ఏకాగ్రత లోపించటం, జ్ఞాపకశక్తి తగ్గటం, వ్యాధినిరోధకశక్తి తగ్గటం, నడుమునొప్పి వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలు వస్తాయి. ఇవికాక చిరాకు, కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలూ ఎక్కువ అవుతాయి.
ప్రతిప్రాణికి అవసరం
ప్రతి ప్రాణికి నిద్ర ఎంతో అవసరం. కంటినిండా నిద్రపోతే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండొచ్చు కానీ, ఒక్కరోజు నిద్రపోకుండా ఉండలేరు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఎంతో అవసరం. అసలు నిద్రలో ఏం జరుగుతుంది? చక్కగా నిద్రపోతున్నప్పుడు గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ వ్యవస్థ తప్ప మెదడుతో సహా మిగిలిన వ్యవస్థలన్నీ బాగా విశ్రాంతి పొందుతుంటాయి. విశ్రాంతిలో శరీరంలోని అవయవాలు తిరిగి శక్తిని పొందుతాయి. నిద్ర సరిగా లేకపోతే అనవసర ఆలోచనలతో మనస్సు శాంతి కోల్పోతుంది. శరీరానికి అలసట తీరక, రోజు రోజుకి అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే కంటినిండా నిద్రపోవాలి అంటారు. 

కారణాలనేకం

నిద్రలేమికి కారణాలు వివిధ రకాలుగా ఉన్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిద్రలేమి సమస్య వల్ల కొంతమంది రాత్రుళ్ళు ఎక్కువ సమయం మేల్కొని ఉండటం, తర్వాత ఎప్పుడో నిద్రపోవడం జరుగుతుంది. కానీ ప్రతిరోజూ రాత్రి దాదాపుగా 7 నుంచి 9గంటలసేపు గాఢంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. అంతేకాదు శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర అవసరం కూడా. నిద్రలేమి సమస్యకు ఒత్తిడి, జీవనశైలి, శారీరక మానసిక రుగ్మతలు, డైట్ వంటివి కారణాలు కావచ్చు.  కారణాలు ఏవైనా, రెగ్యులర్‌గా, సమయానుసారం తగినంత నిద్ర పోవడం చాలా అవసరం. నిద్రలేమి వల్ల మానసికంగాను, శారీరకంగాను అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఏరకంగా నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రిస్తున్నారు అన్నవిషయాన్ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఈ నిద్రలేమి సమస్య దీర్ఘకాలం నుండి కొనసాగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వెంటనే చికిత్స తీసుకోవడం ప్రారంభించాలి. లేదంటే... దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడం, మెమొరీ లాస్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. 

నిద్రలో మెదడు అభివృద్ధి

ఆధునిక ప్రపంచంలో పోటీ, ఒత్తిళ్ళు విపరీతంగా పెరిగిపోవడం, దీనితో మానసికంగా ఆందోళనకు గురికావడం, తత్ఫలితంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం, దానితో శరీరంలోని జీవగడియారంలో మార్పులు (బయోలాజికల్ క్లాక్) సంభవించి నిద్ర పట్టకపోవడం వంటి అనర్థాలు సంభవిస్తున్నాయి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు తదితర అనేక అంశాలవల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. అయితే ముఖ్యంగా మహిళలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నట్లు తెలిసింది. సైంటిస్టులు చేసిన పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నిద్రావస్థలో ఉన్నప్పుడు శరీరంలో కొన్ని ముఖ్యమైన శారీరక మార్పులు సంభవించిడం జరుగుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం నిద్ర మెదడు యొక్క అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుందని గుర్తించబడింది. 

నిద్రలేమితో వృద్థాప్యం!

ప్రకృతి జీవులన్నింటికీ నిద్ర అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. ఈ కారణంగానే యోగులు, మునులు, మహాపురుషులు ఎక్కువ సమయం ధ్యానం అనబడే ఒక రకమైన నిద్ర లేదా విశ్రాంతి స్థితిలో గడుపుతారు. ఇందువల్ల వారు ఎక్కువ కాలం జీవిస్తారు. యోగశాస్త్రం ప్రకారం మనిషికి నిద్రపట్టడం లేదంటే, అతడు తనకు తెలియకుండానే అత్యంత వేగంగా వృద్ధాప్యంలోకి పయనిస్తున్నట్లు లెక్క. నిజానికి నిద్ర అంటే ఒళ్ళు తెలియకుండా పడుకోవడమేనని చాలామంది అభిప్రాయం. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే! ఎందుకంటే నిద్రలోనే శరీరం ఎంతో పనిచేస్తుంది. ఇది వైద్యులు కూడా ఒప్పుకున్న నిజం. రుజువు చేసిన శాస్త్రీయ సత్యం. నిద్రలో మన శరీరంలోని కణజాలాలూ, వ్యవస్థలూ అనేక పనులు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలనూ, విషపదార్థాలను తొలగించడం, చెడిపోయిన కణాలను మరమ్మతు చేయడం అనేవి వాటిలో కొన్ని. మనం మెలకువగా ఉన్నపుడు శరీరం ఈ పనులను సక్రమంగా నిర్వర్తించలేదు. నిద్రలేమికి ‘యోగా’ పలురకాల పరిష్కారాలను సూచిస్తుంది. వాటిని పాటించడం వలన సుఖనిద్రను సొంతం చేసుకోవచ్చు. 

మాత్రలతో ఆరోగ్యానికి ముప్పు

ఇటీవలి కాలంలో మెలటోనిన్ అనే ఇంగ్లీషు మందు నిద్రలేమి వ్యాధిగ్రస్థులకు దివ్యమైన మందుగా పనిచేస్తోందని అంటున్నారు. అయితే శాస్త్రరీత్యా ఈ ఔషధం మనిషిలోని నిద్రను నియంత్రించే అంశాలపై ఒత్తిడిని పెంచి, బలవంతంగా నిద్రపోయేలా చేస్తుంది. నిద్రలో దీర్ఘనిద్రను పోయే స్థితిని ‘రెమ్‌’ అంటారు. మెలటోనిన్ ఈ ‘రెమ్’ స్థితిని అణిచివేస్తుంది. తత్ఫలితంగా మనిషికి నిద్రలేచిన తర్వాత అసహనం, చిరాకు, త్వరగా కోపం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి మందులను దీర్ఘకాలం వాడటం వల్ల మనిషి ఆయుర్దాయంలో పదేళ్ళకాలం మాయం అవుతుందని పరిశోధకులే చెబుతున్నారు. మనిషి ఎంత దీర్ఘంగా, త్వరగా నిద్రలోకి జారుకుంటాడనే అంశం మీదనే ఆ మనిషి ఆరోగ్యస్థితి ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎంతో వాస్తవం ఉంది. ఒక మనిషి ఎంత త్వరగా, దీర్ఘంగా నిద్రపోగల్గితే వారు అంత శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క.

నిద్రలేమితో అల్జీమర్స్‌!

నిద్రలేమి సమస్య ఎక్కువ అయితే అది అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కంటినిండా నిద్రపోయినవారు రోజంతా ఎంతో హుషారుగా ఉండటమే కాకుండా వారు చేసే పని కూడా ఎంతో ఆహ్లాదకర వాతావరణంతో నిండి ఉంటుందని, సరైన నిద్ర లేకపోతే మెదడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాప కింద నీరులా వ్యాపించే అల్జీమర్స్ వ్యాధి ప్రారంభంలో బ్రెయిన్‌లో కలిగే మార్పులకు సంబంధించి లక్షణాలు పెద్దగా కనిపించవు. దశాబ్దాల తరువాత ఈ ప్రభావం కనిపిస్తుంది. మతిమరుపు రావడం, గందరగోళానికి గురికావడం, ఆలోచనాశక్తి నశించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్ ఫంక్షన్ మార్పులు సంభవించి అల్జీమర్స్‌గా రూపాంతరం చెందుతాయి. 
ఇలా ప్రయత్నించండి
నిద్ర సరిగ్గా పట్టకపోవడాన్ని ఇన్‌సోమ్నియా అంటారు. దీనికి చాలా కారణాలుంటాయి. కొందరికి బెడ్ పైకి వెళ్లాక ఎంతకూ నిద్ర రాదు. చాలామందికి బాగా నిద్రపోవాలని ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా నిద్రరాదు. కంటినిండా నిద్రపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
•నిద్రించేముందు, కొద్ది సమయం యోగా, ధ్యానం లేదా తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది కండరాలను శ్రమింపజేసి శరీరాన్ని, మనస్సును నిద్రించేందుకు అనువుగా తయారుచేస్తుంది.
•తిన్న వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించకూడదు. రాత్రిపూట భోజనానికి, నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు తేలిగ్గా నిద్ర పడుతుంది. రాత్రిపూట భోజనం చేశాక కొంతసేపు వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
•నిద్రపోయే ముందు టీ, కాఫీ వంటివి తాగరాదు. అందుకు బదులుగా పాలు తాగవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగి 30 నిమిషాలు ఆగాక నిద్రిస్తే, చక్కని నిద్ర పడుతుంది.
•నిత్యం ఒకే సమయానికి నిద్రించాలి. ఒకే సమయంలో నిద్ర లేవాలి. ఇలా చేయడం వల్ల జీవనశైలి సరిగ్గా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. 
•తక్కువ సౌండ్‌తో మీకు నచ్చిన ఆహ్లాదకరమైన సంగీతం వినండి. లేదా పుస్తకం చదవండి. నిద్రించడానికి కనీసం 30 నిమిషాల ముందే ఫోన్, కంప్యూటర్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండండి.
.•నిద్రపోయేటప్పుడు ఒంటికి బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకండి. బాగా లూజ్‌గా ఉండి సౌకర్యంగా ఉండేవాటినే వేసుకోండి. 
•పడుకునే ముందు మీరు పాలు తాగితే కచ్చితంగా వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. మెలటొనిన్ వల్లే మనకు నిద్ర బాగా పడుతుంది. ఇది పాలలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాగా నిద్రపోవాలంటే పాలు తాగడం మరిచిపోకండి.
– లావణ్య వెనగంటి