పచ్చిబఠాణి పోషకాల రాణి!

02-03-2019: కూరల్లో, సలాడ్స్‌లో రుచికోసం పచ్చిబఠాణీని వాడుతాం. వీటిలో పోషకవిలువలు అధికం. రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేయడంతో పాటు చర్మం, కేశ సంరక్షణలోనూ ఇవి దోహదపడతాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
 
లెగ్యూమ్‌ జాతి ఇతర గింజల కన్నా పచ్చి బఠాణీలో కేలరీలు చాలా తక్కువ. వీటిలో మంచి కొవ్వుల శాతం ఎక్కువ. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పచ్చిబఠాణీలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది.
వీటిలో విటమిన్‌ బి, ఫోలిక్‌ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చిన్న పిల్లల్లో నాడీ సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి.
వీటిని తింటే బి, సి, కె విటమిన్లు లభిస్తాయి. వీటిలో క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం వంటి మినరల్స్‌ ఎక్కువ మోతాదులో ఉంటాయి.
వెంట్రుకల కుదుళ్లకు పోషణనిస్తాయి. వీటిలోని విటమిన్‌ సి జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది.
వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కప్పు పచ్చిబఠాణీలో ప్రొటీన్లు ఎక్కువగా, కేలరీలు వంద కన్నా తక్కువగా ఉంటాయి. దాంతో బరువు పెరగకూడదనుకునే వారు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
పచ్చిబఠాణీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌, ఫినాల్స్‌ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. చర్మం మీది ముడతలను నివారించి, వయసు తక్కువ కనిపించేలా చేస్తాయి. గుండె, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు టైప్‌ 2 డయాబెటీ్‌సను నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో లభించే కౌమెస్ట్రోల్‌ ఫినోల్‌ గ్యాస్ట్రో కేన్సర్‌ను నివారిస్తుంది.
దీనిలోని నియాసిన్‌ అనే విటమిన్‌ ట్రైగ్లిసరాయిడ్స్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపు చేస్తుంది.
పచ్చిబఠాణిలో విటమిన్‌ కె పుష్కలంగా లభిస్తుంది. ఇది అల్జీమర్స్‌, ఆర్థరైటిస్‌ సమస్యల్ని తగ్గిస్తుంది.
కాలిన గాయాల మీద పచ్చి బఠాణీ పేస్టును రాస్తే నొప్పి తగ్గుతుంది.