సీమచింత.. ఆరోగ్యానికి నిశ్చింత!

10-05-2019: అచ్చం చింతకాయను పోలి ఉండే సీమచింత వేసవిలో ఎక్కువగా కాస్తుంది. తీయగా ఎరుపు, గులాబీ రంగుల్లో ఉన్న సీమచింతను చూడగానే నోరూరుతుంది. దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి. వివిధ వంటకాల్లోనూ ఉపయోగించే ఈ కాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అవేమిటంటే...
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను తొలగించి కేన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి.
మొటిమలు, చర్మం మీద తెల్ల మచ్చలు ఏర్పడడాన్ని నివారిస్తుంది. ముఖం మీది నల్లటి వలయాలను తొలగిస్తుంది.
ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు దీనిలో ఎక్కువగా లభిస్తాయి. ఐరన్‌, ఫాస్ఫరస్‌, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, సోడియం, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలు అందుతాయి.
దీనిలోని థయామిన్‌ చక్కెరలను శక్తిగా మారుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
వీటిలో ఉండే విటమిన్‌ ఇ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
వెంట్రుకలు రాలిపోవడాన్ని నివారిస్తుంది. మాడు భాగంలోని జిడ్డు కూడా వదులగొడుతుంది.
వీటిలోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి డైట్‌.
సీమచింతలోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది.
దీనిలోని పొటాషియం గుండెపోటను నివారిస్తుంది. రక్తప్రసరణను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
పంటినొప్పి, చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. నోటి అల్సర్లను నివారిస్తుంది.
ఈ చెట్టు బెరడు నుంచి తీసిన కషాయం విరేచనాలు, డయేరియా నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.