గోల్డెన్‌ గ్రీన్‌టీ

28-08-2017: గ్రీన్‌ టీ తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వింటున్నాం. దాంతో గ్రీన్‌ టీని మన జీవితంలో భాగం చేసుకున్నాం. అయితే గ్రీన్‌ టీ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా? అయితే ఈ వాస్తవాలు తెలుసుకోండి.

మెటబాలిజం పెరుగుతుంది: గ్రీన్‌ టీ లో ఉండే కెఫీన్‌ వల్ల శరీర కొవ్వు కరగటంతోపాటు మెటబాలిజం కూడా పెరుగుతుంది. కప్పు గ్రీన్‌ టీలో 20 నుంచి 40 మి.గ్రా కెఫీన్‌ ఉంటుంది. అలాగే దీనిలో క్యాచెటిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెటబాలిజమ్‌ను బూస్ట్‌ చేస్తాయి.

వ్యాయామంతో రెట్టింపు: గ్రీన్‌ టీ తాగితే కొవ్వు వేగంగా కరుగుతుంది. దీనికి వ్యాయామాన్ని కూడా జోడిస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది. అంటే గ్రీన్‌ టీ తాగుతూ వ్యాయామం చేయగలిగితే బరువు తగ్గే వేగం 15 శాతం పెరుగుతుంది. అంతేకాదు. విశ్రాంతిలో ఉన్నా కొవ్వు కరిగే వేగంలో మార్పు ఉండదు.

తక్కువ తింటాం: గ్రీన్‌ టీ తాగటం వల్ల తక్కువ కెలోరీలను తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. అలాగే గ్రీన్‌ టీ ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల కూడా శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరకుండా ఉంటాయి.