నెయ్యి మనకు నేస్తమే

01-01-2019: నెయ్యితో కొవ్వు పెరిగిపోతుందని, ఆది ఆరోగ్యానికి హానికరమనే ఒక భావన చాలా మందిలో ఉంటుంది. నెయ్యిలో కొవ్వు ఉన్నది నిజమే కానీ, అది కరిగిపోయి శక్తినిస్తుందే తప్ప హానిచేయదు. మేధోశక్తినీ, జ్ఞాపకశక్తినీ పెంచడంలోనూ జీర్ణవ్యవస్థను చక్కదిద్దడంలోనూ నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది. గాయాలను మాన్పడంలోనూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ నెయ్యి పాత్ర కీలకమే. శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను దెబ్బతీసే యాంటీ ఆక్సిడెంట్లు నెయ్యిలో సమృద్ధిగా ఉన్నాయి. పరిమితికి లోబడితీసుకుంటే నెయ్యితో లాభాలు బోలెడు...

బీటా కెరోటిన్లకు, ఎ,డి,కె విటమిన్లకు నెయ్యి ఒక నిధిలాంటిది. నెయ్యితో లభించే సహజసిద్ధమైన విటమిన్‌ ఏ, ఇతర వంటనూనెల్లో లభించేదాని కన్నా ఎంతో నాణ్యమైనది.

నెయ్యిలో అంతకు ముందున్న పాల తాలూకు అంశాలు, లాక్టోస్‌, షుగర్లు ఉండవు కాబట్టి పాలు పడని వారు కూడా నె య్యిని నిస్సందేహంగా తీసుకోవచ్చు.
శరీరంలోని మలినాలను బయటికి పంపే శక్తి కూడా నెయ్యిలో ఉంది.
పిల్లల ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు నెయ్యి వారి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తినీ పెంచుతుంది.
కాలిన లేదా తెగిన గాయాల పైన నేరుగా కాస్తంత నెయ్యి పూస్తే చాలు మానిపోతాయి.
నెయ్యిలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియలను ఉత్తేజపరచడంతో పాటు, కొలెస్ట్రాల్‌నూ, శరీరం బరువునూ తగ్గిస్తాయి.
కంటిపై నెయ్యి ఒత్తిడిని తగ్గిస్తుంది. గ్లూకోమా సమస్యను నియంత్రిస్తుంది.