అరుగుదలకు అయిదు పద్ధతులు

08-01-2019:ఈ రోజుల్లో చాలామంది ఫిట్‌నెస్‌ లేమితో బాధపడుతున్నారు. అంతేనా... సరిపడినంత నిద్ర ఉండడం లేదని ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫాస్ట్‌ ఫుడ్స్‌, ప్రోసెస్డ్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌కు అలవాటుపడ్డం వల్ల జీర్ణక్రియ బాగా దెబ్బతింటోంది. వ్యాయామాలు చేయడానికి ఎవరికీ సమయం ఉండడంలేదు. వీటన్నింటి వల్ల రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో జీర్ణసంబంధ సమస్యలు ఎక్కువయ్యాయి. ఇవి దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే జీర్ణక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకు సహకరించే ముఖ్యమైన ఐదు ఔషధ మూలికలు ఉన్నాయి. అవి మన వంటింట్లోనే ఉన్నాయి. అవేమిటంటే...
 
అల్లం
మన వంటకాల్లో అల్లం తప్పనిసరి. ఇది రెసిపీలకు అదనపు రుచిని ఇవ్వడమే కాదు జీర్ణశక్తిపై కూడా బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్‌ యాసిడ్స్‌, జీర్ణం చేసే ఎంజైములను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.
 
నల్లమిరియాలు
నల్ల మిరియాలు మంచి మసాలా దినుసు. దీని పొడిని కొన్ని రెసిపీలపై అలంకరణగా కూడా వాడతారు. ఈ మిరియాల్లో పైపరైన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారంలోని పోషకవిలువలను గ్రహిస్తుంది. కడుపులోని ఆహారం బాగా అరిగేలా చేస్తుంది. కడుపులో గ్యాసు లేకుండా నివారించడంతో పాటు కలుషిత పదార్థాలు లేకుండా శుభ్రం చేస్తుంది.
 
త్రిఫల
మూడు ఔషధ ఫల మూలికల మిశ్రమం ఇది. దీన్ని ఉసిరి, కరక్కాయ, తనిక్కాయలతో చేస్తారు. దీనినే త్రిఫల అంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఇది జీర్ణ వ్యవస్థలో గ్యాసు చేరకుండా నిరోధిస్తుంది. జీర్ణకోశ కండరాల కదిలికలను సులభతరం చేస్తుంది. ఆహారం బాగా జీర్ణమయ్యేట్టు సహాయపడుతుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది.
 
సోంపు
సోంపును చాలామంది మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా వాడుతుంటారు. నిజానికి సోంపు గింజల్లో జీర్ణవ్యవస్థకు ఉపయోగపడే ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్రేవుల కండరాల కదలికలకి సోంపు బాగా సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థలో చేరిన గ్యాసును బయటకు పోయేట్టుచేస్తుంది.
 
శంఖ భస్మ
ఇది ఆయుర్వేద మందు. శంఖం నుంచి ఈ మందును ఆయుర్వేద నిపుణులు తయారుచేస్తారు. శంఖ భస్మ వల్ల ఆకలి బాగా వేయడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. గ్యాస్ర్టైటీస్‌ లాంటి జీర్ణసంబంధిత సమస్యల నుంచి సాంత్వననిస్తుంది. అయితే దీనిని జీర్ణ సంబంధిత సమస్యల నివారణకు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచిది.