‘పెయిన్‌ మేనేజ్‌మెంట్‌’ గురించి తెలుసా

తల పగిలే మైగ్రెయిన్‌ నొప్పి!

కదిల్చే వీలు లేని కీళ్ల నొప్పి!
తట్టుకోలేని కేన్సర్‌ నొప్పి! 
ఇలా నొప్పుల్లో పలు రకాలు!
వాటి నుంచి ఉపశమనం పొందే వీలుంది!
 
26-02-2019:రోడ్డు ప్రమాదంలో తుంటి విరిగి ఆస్పత్రికి చేరిన వ్యక్తికి సర్జరీ అవసరం పడవచ్చు. ఆ లోగా ఎక్స్‌ రే, ఎమ్మారై లాంటి పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఆ పరీక్షల ఫలితాలన్నీ పరిశీలించి వైద్యులు సర్జరీ చేసేవరకూ రోగి నొప్పితో అల్లాడిపోకుండా, ‘పెయిన్‌ మేనేజ్‌మెంట్‌’ పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. నొప్పికి కారణమయ్యే నరాన్ని మొద్దుబార్చడం ద్వారా రోగికి తక్షణ ఉపశమనం కలిగించడం ఈ చికిత్సా విధానం ప్రధమోద్దేశం. అయితే ఇదే విధానం మందులకు లొంగని నొప్పులు, నొప్పితో కూడిన దీర్ఘకాల వ్యాధులు, సర్జరీ తదనంతర నొప్పులు...ఇలా పలురకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం కూడా అవలంబిస్తున్నారు. అదే...‘పెయిన్‌ మేనేజ్‌మెంట్‌’!
 
నొప్పి తగ్గించే పద్ధతులు
నొప్పుల్లో తీవ్రమైనది (అక్యూట్‌), దీర్ఘకాలంపాటు కొనసాగేది (క్రానిక్‌) అనే రెండు రకాలుంటాయి. ప్రమాదంలో ఎముకలు విరిగిన వాళ్లకు కలిగే నొప్పి తీవ్రమైనది. దీనికి తక్షణ ఉపశమనం అవసరం. సర్జరీ లేదా కేన్సర్‌ వ్యాధి నుంచి కోలుకుంటున్న రోగులు, మైగ్రెయిన్‌ లాంటి దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్నవారికి, ఎక్కువ కాలం పాటు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చికిత్స అవసరం. ఈ రెండు సందర్భాల్లోనూ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఉపకరిస్తుంది.
 
దీర్ఘకాల నొప్పులంటే?
మూడు నెలలకు మించి నొప్పి తగ్గకపోతే దాన్ని క్రానిక్‌ పెయిన్‌గా పరిగణించవచ్చు. మధుమేహం, ఆస్టియో ఆర్థ్రయిటిస్‌, పలు రకాల కేన్సర్లు, మధుమేహంలో తలెత్తే భుజం నొప్పి, న్యూరాల్జియా, పార్శ్వ నొప్పి, టెండాన్‌ గాయాలు...వీటన్నిటికీ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ చికిత్స తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మధుమేహంలో తలెత్తే భుజం నొప్పికి భయపడి, చేతిని కదల్చకుండా ఉండిపోతే, అలాగే బిగుసుకుపోయి కదలికలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెయిన్‌ మేనేజ్‌మెంట్‌తో నొప్పి తగ్గించుకుని, ఫిజియోథెరపీతో భుజం కదలికలు సరి చేసుకోవచ్చు. అలాగే మోకాలి మార్పిడి చేయించుకునే వీలు లేని ఆర్థరైటిస్‌ రోగులు, సర్జరీ చేయించుకున్నా నొప్పి తొలగని రోగులు కూడా పెయిన్‌ మేనేజ్‌మెంట్‌తో నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
చికిత్స ఇలా!
అలా్ట్రసౌండ్‌, ఎక్స్‌ రే, సిటి స్కాన్‌, రియల్‌టైమ్‌ ఇమేజింగ్‌ సహాయంతో నొప్పికి కారణమయ్యే నాడిని గుర్తించి, కెథటర్‌ సహాయంతో నరాన్ని మొద్దుబార్చే మందు అందిస్తారు. కొన్ని సందర్భాల్లో నరాన్ని కాల్చేయడం కూడా జరుగుతుంది. అయితే అది ఏ రకమైన నరం అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. నరాల్లో సెన్సరీ, మోటార్‌, మిక్స్‌డ్‌ అనే మూడు రకాల నరాలుంటాయి. వీటిలో నొప్పి, మంట, వేడిలను తెలిపేది సెన్సరీ నర్వ్‌! మోటార్‌ నర్వ్‌కు కండరంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి నొప్పి తగ్గించే ఇంజెక్షన్‌ ఎంత ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎంతకాలంపాటు ఇవ్వాలి? అనేది నరం రకాన్నిబట్టి నిర్ణయిస్తారు.
 
కెథెటర్‌: నొప్పి కలుగుతున్న అవయవానికి సంబంధించిన నరానికి కెథటర్‌ అమర్చి, ఇంజెక్షన్‌ ఇస్తారు. ఈ ఇంజెక్షన్‌తో నొప్పి అదుపులోకి వస్తే, ఆ ఉపశమనాన్ని పొడిగించే చికిత్స కొనసాగించాలి. అదే... ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌’!
 
రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌: దీన్లో ‘కన్వెన్షనల్‌’, ‘పల్స్‌ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌’ అనే రెండు పద్ధతులు ఉంటాయి. కన్వెన్షనల్‌ పద్ధతిలో నరాన్ని పూర్తిగా కాల్చేస్తారు. పార్శ్వపు తలనొప్పి, థైరాయిడ్‌, మధుమేహుల్లో మంటను కలిగించే నాడులు, మూత్రపిండాలు ఫెయిల్‌ అయిన వాళ్లలో ఆ నాడులను కాల్చేయడం వల్ల ఆ ప్రదేశాల్లో స్పర్శ కోల్పోవడం తప్పించి పెద్దగా నష్టం ఉండదు. పైగా 3 నుంచి 5 ఏళ్లపాటు నొప్పి తొలగిపోతుంది. కానీ నరం కండరంతో కలిసి ఉన్నప్పుడు ఈ చికిత్స కుదరదు. అలాంటప్పుడు పల్స్‌ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ సహాయంతో అవయవ కదలికలు దెబ్బతినకుండా కేవలం నొప్పిని మాత్రమే తగ్గించే చికిత్స ఇస్తారు.
 
జీవన నాణ్యతను పెంచే ప్రత్యామ్నాయం!
నొప్పి తగ్గించడం కోసం దీర్ఘకాలం తీసుకునే నోటి మాత్రల వల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయనే విషయం అందరికీ తెలిసిందే! ఈ మాత్రల వల్ల ఎసిడిటీ కూడా తప్పదు. కానీ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో కేవలం నొప్పికి కారణమయ్యే నరానికే నేరుగా చికిత్స అందుతుంది. ఫలితం వెంటనే కనిపిస్తుంది. నొప్పి తత్వాన్ని బట్టి, స్వల్ప కాలమైనా, దీర్ఘకాలమైనా ఉపశమనాన్ని కలిగించే వీలు ఈ చికిత్సా విధానానికి ఉంది. అలాగే, కేన్సర్‌ నొప్పి నివారణకు ‘నార్కోటిక్స్‌’ వాడితే వాటి దుష్ప్రభావాలనూ భరించక తప్పదు. మలబద్ధకం, వాంతులు, మత్తుగా ఉండడం...ఇలా నార్కోటిక్స్‌ తీసుకోవడం వల్ల నొప్పితోపాటు జీవన నాణ్యత కూడా తగ్గిపోతుంది. పెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో నోటి మ్రాతలు, ఇతరత్రా మందుల వాడకం తగ్గడం వల్ల నాణ్యమైన జీవనం సాధ్యపడుతుంది.
 
ఇతర నొప్పులకు కూడా... 
సయాటికా: తుంటి నుంచి కాల్లోకి పాకే సయాటికా నొప్పికి కారణమయ్యే డిస్క్‌ ప్రొలా్‌ప్సకు, ఎముక ఎంత బయటకు వచ్చిందనేదాన్నిబట్టి ‘ఎపిడ్యురల్‌ స్టెరాయిడ్స్‌’ తక్కువ మోతాదులో ఇస్తారు. దాంతో డిస్క్‌ పరిమాణం తగ్గి, నరం మీద ఒత్తిడి తగ్గి నొప్పి అదుపులోకి వస్తుంది. అయితే డిస్క్‌ మొత్తం బయటకు వస్తే సర్జరీ ఒక్కటే పరిష్కారం.
 
నడుము నొప్పి: నడుము నొప్పికి ఎన్నో కారణాలున్నా ‘ఫేసెట్‌ జాయింట్ల కారణంగా తలెత్తే నొప్పికి పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో చికిత్స చేయవచ్చు. ఈ జాయింట్లు వాచినా, పెరిగినా నరం నొక్కుకుపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని ‘ఫేసెట్‌జాయింట్‌ హైపర్‌ట్రోఫీ’ అంటారు. దీనికి సర్జరీ లేదు. మందులతో అదుపులోకి రాకపోతే పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ విధానం అనుసరించవచ్చు.
 
కండరాల నొప్పులు: కండరాలు బెణికి, వారం నుంచి పది రోజులు దాటినా నొప్పి తగ్గకపోతే, ‘మజిల్‌ బ్లాక్‌’ ద్వారా నొప్పి తగ్గించవచ్చు.
 
పార్శ్వపు తలనొప్పి: మైగ్రెయిన్‌ నొప్పిలో నరం మీద ధమని ఒత్తిడి ఉంటుంది. సర్జరీలో నరాన్ని, ధమనిని వేరు చేస్తారు. కొందరికి ఇలాంటి ఇబ్బంది లేకుండానే మైగ్రెయిన్‌ ఉంటుంది. అప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ సహాయపడుతుంది.
 
మెరాల్జియా: ఒక తొడలో భరించలేనంత మంట ఉంటుంది. ఈ సమస్యనూ తొలగించవచ్చు.
 
సర్పి: నొప్పితో కూడిన ఈ చర్మ సమస్యను మొదట్లో గుర్తించకపోతే, పోస్ట్‌ హెపటిక్‌ న్యూరాల్జియాగా పరిణమిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ ఉండకపోయినా, నొప్పి మిగిలిపోతుంది. పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఉపశమనం పొందవచ్చు.
 
కేన్సర్‌ చివరి దశలో: మరో రెండు మూడు నెలలకు మించి బ్రతికే వీలు లేని కేన్సర్‌ రోగులు నొప్పితో ఆ కొద్ది కాలం జీవించి ఉండడం దుర్లభం. అలాంటివాళ్లకు మెదడు, వెన్నుపాములోకి స్రవించే ద్రవంలోకి ఆల్కహాల్‌ ఎక్కించే చికిత్స ఇవ్వవచ్చు. దాంతో నొప్పి తగ్గుతుంది.
 
ఒక్కోసారి...నొప్పి ప్రాణాంతకం కూడా!
హృద్రోగులకు నొప్పి కారణంగా తలెత్తే ఒత్తిడి ప్రభావం గుండె మీద పడుతుంది. దాంతో గుండెపోటు రావచ్చు. కాబట్టి హృద్రోగులు నొప్పుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.
 
చికిత్స నొప్పి లేకుండానే...
పెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో సాగే చికిత్సలో కోతలు ఉండవు. సూపర్‌ఫీషియల్‌ నీడిల్‌ సహాయంతో చర్మం ద్వారా నాడిని చేరుకుని చికిత్స చేయడం జరుగుతుంది. కాబట్టి జనరల్‌ ఎనస్థీషియా బదులు స్వల్ప లోకల్‌ అనస్థీషియాతోనే చికిత్స ముగించవచ్చు.
 
రీ జెనరేటివ్‌ థెరపీ
భుజాలు, మోకాళ్లు, పాదాల్లో టెండాన్‌లో చిన్న చిన్న చిరుగులు ఉండి, ఆ కారణంగా భరించలేనంత నొప్పి ఉంటే ఇంతకుముందు స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లతో నొప్పి తగ్గించేవారు. కానీ వీటికి తాజా ఆధునిక చికిత్సా విధానం ‘రీ జెనరేటివ్‌ థెరపీ’. ఈ చికిత్సలో రోగి రక్తం తీసుకుని, ప్లేట్‌లెట్లు వేరు చేసి, తిరిగి ఇంజెక్ట్‌ చేస్తారు. దీంతో దీర్ఘకాలంపాటు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. అయితే చికిత్స ఇచ్చిన వారం రోజుల నుంచి ప్రభావం కనిపిస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవు. మడమ శూలకు ఈ చికిత్స చక్కని ప్రత్యామ్నాయం.