చల్ల నీళ్లు చేటు!

08-04-2019: వేసవి వేడిని చప్పున చల్లార్చేవి చల్ల నీళ్లే! అందుకే ఫ్రిజ్‌లో గడ్డకట్టడానికి సిద్ధంగా ఉన్న నీళ్లు తాగడానికే ఇష్టపడతాం! కానీ అతి చల్లని నీటితో చేటే ఎక్కువ!
 
వేడి, చల్ల నీళ్లు శరీరం మీద సత్వర ప్రభావం చూపిస్తాయి. వేడి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అవే చల్ల నీళ్లైతే తెరుచుకున్న చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా కుంచించుకుపోయే స్వభావం జీర్ణాశయానికీ ఉంటుంది. ఫలితంగా జీర్ణశక్తి తగ్గుతుంది. అంతేకాదు....
 
చల్లని నీళ్లు తాగితే అవి జీర్ణమై రక్తంలో కలిసే వేగం తగ్గుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు లోనవుతాం. రక్తనాళాలు కూడా కుంచించుకుపోతాయి.
చల్లని నీరు శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. దాంతో ఆ ఉష్ణోగ్రతను సమం చేయడానికి అవసరమైన శక్తిని, ఆహారం జీర్ణం చేసుకుని పోషకాల నుంచి గ్రహించకుండా, అప్పటికే నిల్వ ఉన్న శక్తి నుంచి శరీరం ఖర్చు చేస్తుంది.
భోజనానంతరం చల్లటి నీళ్లు తాగితే శరీరంలో ఎక్కువగా శ్లేష్మం తయారవుతుంది. ఫలితంగా రోగనిరోధకశక్తి తగ్గి తేలికగా జలుబు, దగ్గు బారిన పడతాం.
భోజనం తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగితే ఆహారంలోని కొవ్వులు గడ్డకట్టిపోతాయి. దాంతో జీర్ణాశయం అవసరానికి మించి శ్రమించవలసి వస్తుంది.

గోరువెచ్చని నీరే మేలు!

కేలరీలు ఖర్చు కావాలంటే చల్లటి నీళ్లు తాగాలని కొందరు నమ్ముతారు. కానీ జీర్ణశక్తిని కుంటుపరిచి, జీర్ణవ్యవస్థను ఒత్తిడికి లోను చేసి కేలరీలను ఖర్చు చేసే పద్ధతి ఆరోగ్యకరం కాదు. అధిక బరువు తగ్గడానికి ఇంతకుమించిన ఆరోగ్యకరమైన మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిని అనుసరించాలి. చల్లటి నీళ్లు తాగడం మాని గోరువెచ్చని నీటిని తాగాలి. ఈ నీటితో ఎన్నో లాభాలున్నాయి. అవేంటంటే...
 
త్వరగా జీర్ణమై రక్తంలో కలుస్తాయి కాబట్టి డీహైడ్రేషన్‌ సమస్య ఉండదు.
గోరువెచ్చని నీళ్లు జీర్ణాశయాన్ని ప్రేరేపిస్తాయి. దాంతో జీర్ణరసాలు ఊరి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
 గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పేగుల కదలికలు మెరుగవుతాయి.
రక్తశుద్ధి జరుగుతుంది. విసర్జకవ్యవస్థకు సంబంధించిన అంగాలన్నీ సమర్ధంగా పని చేస్తాయి.