చల్ల చల్లగా!

26-03-2019: ఎండ వేడికి ఆవిరయ్యే శరీరంలోని నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతోపాటు ఒంటిని చల్లబరిచే పదార్థాలు కూడా తింటూ ఉండాలి. అప్పుడే వేసవి ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం!
 
పుచ్చకాయ: 91.45 శాతం నీరుండే పుచ్చకాయ దాహార్తిని తీర్చడంతోపాటు, ఎండ వేడికి ఆవిరయ్యే శరీరంలోని ఖనిజ లవణాలనూ భర్తీ చేస్తుంది. కాబట్టి తరచుగా పుచ్చకాయ ముక్కలు తింటూ ఉండాలి. అయితే ముందుగానే కోసి పెట్టుకున్నవి కాకుండా తాజాగా కోసుకుని తింటే ఫలితం బాగుంటుంది.
 
తర్బూజా: ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల ఈ కాలంలో తలెత్తే మలబద్ధకం సమస్యకూ ఈ కాయ విరుగుడులా పని చేస్తుంది. నీటి శాతం ఎక్కువ కాబట్టి ఎండ దెబ్బ నుంచి రక్షణ
కల్పిస్తుంది.
 
నిమ్మరసం: ఎండలో నుంచి నీడ పట్టుకు చేరగానే గ్లాసుడు నిమ్మరసం తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అయితే ఎండలోకి వెళ్లే ముందు నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఎండ ప్రభావం తగ్గుతుంది. ఎండ వల్ల బడలిక, నీరసం రాకుండా ఉంటాయి.
 
పెరుగు: ఒంటిని చల్లబరిచే పదార్థాల్లో ప్రధమమైనది పెరుగు. మజ్జిగ, లస్సీ, రైతా... ఏ రూపంలోనైనా పెరుగు తినవచ్చు. పెరుగు వల్ల రెండింతల ప్రయోజనం పొందాలంటే, దీన్లో పచ్చి కూరగాయ ముక్కలు లేదా పళ్ల ముక్కలు వేసుకుని తినాలి. అలాగే కూరగాయలతో పెరుగు పచ్చళ్లు చేసుకుని తిన్నా వేసవి వేడిమి నుంచి రక్షణ పొందవచ్చు.
 
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లు అత్యుత్తమ వేసవి పానీయం. ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించే పోషకాలన్నీ కొబ్బరి నీళ్లలో ఉంటాయి. వేడి వాతావరణంతో పోరాడే శక్తి పొందాలంటే తరచుగా కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి.
 
పుదీనా: పుదీనా తరిగి పెరుగు, మజ్జిగ, రైతాల్లో వేసుకుని తినాలి. పుదీనాతో పచ్చడి చేసుకుని కూడా తింటూ ఉండాలి. పుదీనా ఒంటి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.