చెర్రీ జ్యూస్‌తో నిద్రలేమికి చెక్‌!

09-11-2017: నిద్రలేమి అనేది వయస్సు పైబడిన వారిలో సాధారణంగా కనిపించే సమస్య. ఇది ఆరోగ్య సమస్య కాకపోయినా, దీని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు లోటు ఉండదు. చాలామందిని రకరకాలుగా బాధపెట్టే ఈ సమస్యకు చెర్రీ జ్యూస్‌తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇదే విషయం మీద లూసియానా యూనివర్శిటీ పరిశోధకులు కొందరి మీద అధ్యయనం నిర్వహించారు. దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వారికి రెండు పూటలా చెర్రీ జ్యూస్ ఇచ్చారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలోనూ, రాత్రి పడుకోవడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు గ్లాసు చెర్రీ జ్యూస్ ఇచ్చారు. కొన్ని రోజుల అనంతరం వీరి నిద్ర పోయే సమయాన్ని పరిశీలించారు. గతంలో కన్నా వారు గాఢనిద్ర పోయిన విషయాన్ని వీరు గుర్తించారు. చెర్రీ జ్యూస్ తాగడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఈ జ్యూస్‌తాగడం ద్వారా నిద్రలేమిని కూడా అధిగమించవచ్చని వీరు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు.