చేపలతో ఎన్నో వ్యాధులకు బ్రేక్‌

13-08-2018: అత్యంత సులువుగా జీర్ణమై, అమితమైన శక్తిని ఇచ్చే వాటినే గొప్ప ఆహారంగా చెప్పుకుంటాం. అలా చూస్తే, వాటిల్లో ప్రథమ స్థానం చేపలదే అవుతుంది. ఎందుకంటే శక్తినిచ్చేవిగానే కాకుండా, ఎన్నోరకాల వ్యాధులకు చెక్‌ పెట్టే ఔషధంగా కూడా చేపలు ఉపయోగపడతాయి. చేపల ద్వారా శరీరానికి కావలసినంత ప్రొటీన్‌, క్యాల్షియం లభిస్తుందన్నది అందరికీ తెలిసినదే. అయితే, ‘జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌’ అనే తాజా సంచికలోని ఒక వ్యాసంలో చేపల వల్ల కలిగే మరికొన్ని విశేష ప్రయోజనాల వివరణ ఉంది. అందులో చేపల వల్ల శరీరానికి అందే ఒమేగా- 3 మనిషి ఆయుష్షును పెంచుతుందనే విషయంతో పాటు అది ఏ రకం వ్యాధులను ఏ స్థాయిలో నియంత్రిస్తుందో కూడా అందులో పేర్కొన్నారు.
 
దాదాపు 15 ఏళ్లుగా తరుచూ ఎక్కువ మొత్తంలో చేపలు తినే పురుషుల్ని పరిశీలిస్తే, వారిలో హృద్రోగాల వల్ల మరణించే వారి సంఖ్య 10 శాతం తగ్గింది. అలాగే కేన్సర్‌ మరణాల సంఖ్య 6 శాతానికి, శ్వాసకోశ వ్యాధులతో మరణించే వారి సంఖ్య 20 శాతానికి తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అన్నింటికన్నా మిన్నగా పురుషుల్లో కాలేయ వ్యాధి మరణాల సంఖ్య 37 శాతానికి తగ్గినట్లు వారు కనుగొన్నారు. ఇక స్త్రీల విషయానికి వస్తే, గుండె జబ్బులు 10 శాతానికి, అల్జీమర్‌ మరణాలు 38 శాతానికి తగ్గినట్లు వారు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇవన్నీ గమనిస్తే, ఎప్పుడో వ్యాధిగ్రస్తులై ప్రాణాపాయం ఏర్పడ్డాక ఆసుపత్రుల చుట్టూ తిరిగే కన్నా రోజు వారి మెనూలో చేపల్ని చేర్చడం ఎంతో ఉత్తమం అని స్పష్టమవుతోంది.