మధ్యాహ్నం మగతెందుకు?

ఆంధ్రజ్యోతి, 25-09-2017: రోజులో ఉదయం సాయంత్రం హుషారుగా ఉన్నా మధ్యాహ్నం అయ్యేసరికి కొందరికి మగతగా అనిపిస్తుంది. దీనికి గల కారణాలపై ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్‌ విశ్వవిద్యాలయం 16 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై అధ్యయనాన్ని నిర్వహించింది. ముందుగా వారు ఎలాంటి ప్రయాణ బడలికకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మాగ్నటిక్‌ రిసోనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) మెషిన్‌ ద్వారా రోజంతా వారి మెదడు పనితీరును నమోదు చేశారు. ఉదయం, సాయంత్రం వేళలతో పోల్చితే మధ్యాహ్న సమయంలో మెదడు పనితీరు బాగా మందగించిందని తేలింది. మెదడు పనితీరును నియంత్రించే పుటామెన్‌ల పనితీరును అధ్యయనం చేశారు. ముఖ్యంగా మెదడుకు ఎడమభాగంలో ఉండే పుటామెన్‌ ఉదయం, సాయంత్రం వేళల్లో చురుగ్గా పని చేసింది. అదే మధ్యాహ్నం మాత్రం దీని పనితీరు ఉన్నపళంగా మందగించినట్టు తేలింది.. దీనివల్ల త్వరగా అలసిపోతున్న భావనకు గురవుతారు. తద్వారా తలెత్తే ఇబ్బందులను నివారించేందుకు తగిన వైద్య సహాయం పొందింతే మంచిదని పరిశోధకులు తెలుపుతున్నారు.