బరువు తగ్గితే మధుమేహం మటాష్‌!

 

 

ఏడాదిలో 15 కిలోలు తగ్గితే 86% సమస్య దూరం
మితాహారమే మంచి మందు.. వైద్యుల సలహా

08-12-2017: మధుమేహ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవడానికి బరువు తగ్గడమే అత్యుత్తమ మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి తక్కువ ఆహారం తీసుకుంటూ క్రమపద్ధతిలో బరువు తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని యూకేలోని న్యూక్యాజిల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆరేళ్ల ముందు నుంచే టైప్‌-2 మధుమేహ సమస్యతో బాధపడుతున్న 298 మందిని ఎంపిక చేసి పరీక్షించామని, వారిలో అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గిన వారు ఈ వ్యాధి నుంచి కోలుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ లో ప్రచురితమయ్యాయి. తక్కువ కాలంలో 15 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గిన వారిలో మధుమేహ వ్యాధి 86శాతం, 10 కిలోలు తగ్గిన వారిలో 73శాతం తగ్గిందట.

 

 
మొదటగా.. ఆహార నియమావళి ప్రారంభించేకంటే ముందే పాల్గొనేవారికి యాంటీ బయాటిక్‌, రక్తపోటు మందులను వాడొద్దని వైద్యులు సూచించారు. 3 నుంచి 5 నెలల మధ్య రోజుకు 825-853 కేలరీల ఆహారాన్ని అందించారు. ఆ తర్వాత 2 నుంచి 6 వారాల పాటు రోజుకు విడతల వారీగా మితాహారం అందించారు. అలా శారీరక శ్రమతో బరువు తగ్గితే కాలేయం, క్లోమంలో కొవ్వు తగ్గి మధుమేహం దూరమవుతుందని తేల్చారు. ఇదే విషయాన్ని న్యూఢిల్లీకి చెందిన ఫోర్టిస్‌ సీ-డాక్‌ ఆస్పత్రి వైద్యుడు అనూప్‌మిశ్రా ధ్రువీకరించారు. మ్యాక్స్‌ ఆస్పత్రి డాక్టర్‌ సుజీత్‌షా మాట్లాడుతూ.. ఈ టెక్నిక్‌తో ఏడుగురిని పరీక్షించగా ఐదుగురిలో ఆశాజనక ఫలితాలు వచ్చాయన్నారు.