టీజింగ్‌తో బరువు పెరుగుతారా?

19-06-2019: సాధారణంగా కాస్త లావుగా ఉన్నవారిని నువ్వు లావుగా ఉన్నావంటే చాలు...తగ్గటానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి అలా టీజ్‌ చేయడం వల్ల మరింత బరువు పెరుగుతారని తాజా అధ్యయనం చెబుతోంది. టీజ్‌ చేయబడనివారికంటే, టీజ్‌ చేయబడినవారి బాడీ మాస్‌ ఇండెక్స్‌లో ప్రతీ సంవత్సరం 33 శాతం పెరుగుదల కనిపిస్తోందట. ఈ అధ్యయనంలో సరాసరి వయసు 11.8 ఉన్న యువత 110మంది పాల్గొన్నారు. లావుగా ఉన్నావని టీజింగ్‌కి గురైనవారు ఎక్కువగా ఒత్తిడికి గురవటం వల్ల కార్టిసాల్‌ అనే బరువు పెరగటానికి సహకరించే హార్మోన్‌ విడుదలవుతుంది. బరువు పెరగటానికి ఇది ఒక కారణం కాగా, టీజ్‌ చేయబడినవారు ఆ బాధ తట్టుకోలేక, మరింత ఎక్కువగా ఆహారం తీసుకుంటున్నారనే మరో కారణాన్ని కూడా చెబుతున్నారు. అయితే ఊబకాయంతో టీజింగ్‌కి గురైనవారు ఏ కారణంతో మరింత బరువు పెరుగుతున్నారనే దానికి మాత్రం ఇంకా స్పష్టమైన ఆధారం లభించలేదు.