తెల్ల రంగుతో టైప్‌-2 మధుమేహం!

వాషింగ్టన్‌, జూన్‌ 21: మనం రోజువారీ వినియోగించే పెయింట్‌ నుంచి కొవ్వొత్తుల తయారీ వరకూ వాడే సాధారణ తెలుపు రంగు మధుమేహానికి కారణమవుతుందని ఒక పరిశోధనలో తేలింది. టైప్‌-2 మధుమేహానికి సంబంధించి క్లోమ నమూనాల్లో టైటానియం డయాక్సైడ్‌కు చెందిన క్రిస్టాలిన్‌ స్పటికాలు ఉన్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నిత్యం వాడే పదార్థాల్లోని తెలుపు రంగు క్లోమ గ్రంధిపై ప్రభావం చూపి టైప్‌-2 మధుమేహానికి కారణమయ్యే అవకాశాలున్నాయని మా పరిశోధనలో తేలింది. గత 5 దశాబ్దాలుగా టైటానియం డయాక్సైడ్‌ వాడకం ఎక్కువైంది. ఇది మధుమేహానికి కారణమవుతుంది’ అని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ప్రొఫెసర్‌ ఆడమ్‌ హెల్లర్‌ తెలిపారు.
 
20వ శతాబ్దం మధ్యలో అత్యంత విషపూరితమైన వర్ణాల వాడకం ఎక్కువైంది. తెలుపు రంగు పెయింట్‌తోపాటు ఆహారం, మందులు, టూత్‌ పేస్టు, సౌందర్య ఉత్పత్తులు, ప్లాస్టిక్‌, పేపర్‌లో టైటానియం వాడకం సర్వసాధారణమైంది. దీని కారణంగా 1960 నుంచి టైటానియం డయాక్సైడ్‌ వార్షిక ఉత్పత్తి 40 లక్షల టన్నులు పెరిగింది. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం గత 4 దశాబ్దాల్లో మధుమేహ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 42.5 కోట్లకు చేరింది.