ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిచ్చే టమోటా!

14-02-2018: టమోటాను రోజువారీ ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించడం వలన కలిగే లాభాల గురించి తెలిసిందే! ఇప్పడు ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందని జర్మనీ అధ్యయనకారులు చెబుతున్నారు. ఒక్కసారిగా ధూమపానం మానేసిన వారిలో ఊపిరితిత్తుల ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనీ, దీన్ని నివారించుకోవడానికి రోజుకు రెండు టమోటాలు లేదా మూడు ఆపిల్స్‌ తినాలని వారు సూచిస్తున్నారు. వయస్సు మళ్ళినవారికి టమోటాలు మంచి మందుగా పనిచేస్తాయని వారు అంటున్నారు. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్షీణత ఎక్కువగా కనిపిస్తుంది. ధూమపానాన్ని మానివేసిన తరువాత కూడా కొన్ని సార్లు ఊపిరితిత్తుల క్షీణత కొనసాగే అవకాశం ఉందనీ, అలాంటి వారికి టమోటాలు, యాపిల్స్‌ మంచి మందుగా పనిచేస్తాయన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 700 మంది మీద వీరు దీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. కొన్నిసార్లు పోషకాహారం లోపం కారణంగా కూడా ఊపిరితిత్తుల క్షీణత సంభవించవచ్చనీ, దీనికి కూడా పై రెండూ మందుగా పనిచేస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.