నిద్రను పాడుచేస్తున్న టెక్నాలజీ

19-03-2018: భారతీయుల నిద్రకు టెక్నాలజీ భంగం కలిగిస్తోందని ఒక సర్వే చెబుతోంది. ఫిలిప్స్‌ అనే సంస్థ నిద్రపై అమెరికా, యూకే, జర్మనీ, పోలండ్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌ తదితర దేశాల్లో సర్వే చేసింది. టెక్నాలజీ కారణంగా సరిగా నిద్రపోవడం లేదని 32 శాతం మంది భారతీయులు పేర్కొన్నారు. తరచూ మారే షిఫ్టులు (పనివేళలు) మంచి నిద్రకు అవరోధం కలిగిస్తున్నాయని 19 శాతం మంది చెప్పారని సర్వే తెలిపింది.

నిద్ర కన్నా వ్యాయామమే ముఖ్యమని, ఆరోగ్యంపై వ్యాయామం ప్రభావం చూపుతుందని, వ్యాయామం చేస్తే మంచినిద్ర పడుతుందని 66 శాతం మంది వెల్లడించారు. బాగా నిద్రపోవడానికి 24 శాతం మంది ధ్యానం చేస్తున్నారు. నిద్రపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరుగుతున్నా.. భారతీయులు మాత్రం నిద్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని, గురక వల్ల సరిగా నిద్రపట్టడం లేదని 21 శాతం చెప్పారు. ఆందోళన, టెక్నాలజీ ప్రభావం తదితర కారణాలు కూడా మంచినిద్రకు అవరోధంగా మారుతున్నాయి. మనసుకు హాయినిచ్చే సంగీతం వినడం ద్వారా 36 శాతం, ఒకే వేళకు పడుకోవడం, లేవడం కారణంగా 32 శాతం మంది బాగా నిద్రపోతున్నారు. చాలినంత నిద్ర లేకపోవడం వల్ల అలసటకు గురవుతున్నామని, చికాకు పడుతున్నామని, చురుకుదనం, ఏకాగ్రత లోపిస్తున్నాయని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. 13 దేశాల్లోని 15 వేల మందిపై సర్వే చేశారు.