బేబీ వాకర్స్‌తో భద్రం!

03-10-2018: పిల్లలకు ఏడెనిమిది నెలల వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు వారిని వాకర్లకి అలవాటు చేయడం సర్వసాధారణం. పిల్లలను వాకర్లకి అలవాటు చేయడమనేది తల్లిదండ్రులకు లాభమే తప్ప పిల్లలకు ఎలాంటి మేలు చేయదనీ, పైపెచ్చు వారిని గాయాల పాలు చేస్తుందంటున్నారు ఓహియో యూనివర్సిటీ అధ్యయనకారులు. సుమారు పది సంవత్సరాల పాటు రెండులక్షల మంది పిల్లల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరిలో సగానికి పైగా పిల్లలు వాకర్ల కారణంగా గాయాలపాలు కావడాన్ని గుర్తించారు. దీనికి కారణం వాకర్లలో పిల్లలు అత్యంతవేగంగా కదులుతుంటారు. వాస్తవానికి ఆ వయస్సు పిల్లలు అంత వేగంగా కదలలేరనీ వాకర్‌ వేగాన్ని అదుపుచేయలేక పిల్లలు పడిపోయి గాయపడుతుంటారని వీరు చెబుతున్నారు. అంతే కాకుండా పిల్లల్ని వాకర్‌కి అలవాటు చేయడం వలన సహజసిద్ధంగా వారిలో కనిపించే ఎదుగుదల ఆగిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లలు నెమ్మదిగా లేచి కూర్చోవడం, అలాగే పట్టుకుని నిలబడడం, నెమ్మదిగా నడవడం అన్నీ వారి ఎదుగుదలకు సాక్ష్యాలనీ, వాకర్‌లో ఇవన్నీ కనిపించవనీ, దానితో వారిలో సహజంగా  కనిపించే ఎదుగుదల ఆగిపోతుందనీ, కొన్నిసార్లు ఇది మెదడు ఎదుగుదల మీద కూడా కనిపించే ప్రమాదముందని వారు స్పష్టం చేస్తున్నారు. పిల్లల్ని వాకర్లకి దూరంగా ఉంచడమే మంచిదని వారు సూచిస్తున్నారు.