టైప్‌–2 డయాబెటిస్‌ని అడ్డుకునే సప్లిమెంట్స్‌

14-08-2019: డయాబెటిస్‌ రాకుండా జాగ్రత్తపడేవారికన్నా వచ్చిన తరువాత జాగ్రత్తపడేవారి సంఖ్యే ఎక్కువ. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఆహార నియంత్రణ, బరువు నియంత్రణ తదితర చర్యల ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే డయాబెటిస్‌ పేషెంట్లు విటమిన్‌–డి సప్లిమెంట్లను తీసుకున్నట్టయితే టైప్‌–2 డయాబెటిస్‌ ఎక్కువ కాకుండా చేసుకోవచ్చన్న విషయం ఇటీవల చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కొంతమందిమీద అధ్యయనం చేశారు. వీరిలో సగం మందిని ఆహార నియంత్రణ పాటించమన్నారు. మరికొందరిని ఆహార నియంత్రణతో పాటు విటమిన్‌–డి సప్లిమెంట్లు కూడా ఇచ్చారు. కొన్నినెలల అనంతరం వీరిని పరీక్షించగా విటమిన్‌–డి సప్లిమెంట్లు తీసుకున్న వారిలో టైప్‌–2 డయాబెటిస్‌ ఎక్కువ కాకపోవడాన్ని గమనించారు. అయితే కేవలం ఈ సప్లిమెంట్ల ఆధారంగానే ఇది అదుపులో ఉందా? మరేదైనా కారణముందా? అన్న విషయం మీద ఇంకా అధ్యయనాలు చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.